పరస్పర భజన | - | Sakshi
Sakshi News home page

పరస్పర భజన

Published Thu, Jan 9 2025 1:46 AM | Last Updated on Thu, Jan 9 2025 1:47 AM

పరస్ప

పరస్పర భజన

పర భజన.. స్వ భజన
● స్టీల్‌ప్లాంట్‌పై భరోసా దక్కలేదు.. మెట్రో ఊసెత్తలేదు.. ● భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ కనెక్టివిటీ ప్రస్తావన లేదు ● చంద్రబాబు, పవన్‌ నోట వినిపించని ‘ఉక్కు’ మాట ● నిరసన తెలిపిన వారిని అరెస్టులు చేయించిన ప్రభుత్వం
ప్రధాని మోదీ సభలో ఆద్యంతం ఇదే తంతు

విశాఖ సిటీ : ప్రధానమంత్రి మోదీ సభతో కూటమి ప్రభుత్వ బండారం బట్టబయలైంది. స్టీల్‌ప్లాంట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌లకు ఉన్న చిత్తశుద్ధేమిటో తేటతెల్లమైంది. గంటన్నర పాటు సాగిన ప్రసంగాల్లో ఎవరి నోటా స్టీల్‌ప్లాంట్‌ మాట రాలేదు. ఉక్కు పరిశ్రమ పరిరక్షణపై భరోసా రాలేదు. మెట్రో రైలు ప్రాజెక్టు ఊసెత్తలేదు. భోగాపురం విమానాశ్రయానికి కనెక్టివిటీ ప్రస్తావన లేదు. సభలో ఆద్యంతం పర భజన, స్వభజన, పరస్పర భజనే వినిపించింది. కేవలం ప్రధానిని పొగడ్తలతో ముంచెత్తడానికే కూటమి ప్రభుత్వం బహిరంగ సభ ఏర్పాటు చేసిందన్న భావన ప్రతీ ఒక్కరిలోను కలిగింది.

మిట్టల్‌ స్టీలే ముద్దా..?

విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై నోరెత్తని చంద్రబాబు మిట్టల్‌ స్టీల్‌ప్లాంట్‌పై మాత్రం తెగ ప్రేమను కురిపిస్తున్నారు. మిట్టల్‌ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులను ఎలా తొలగించాలన్న అంశంపై ప్రధాని మోదీతో మాట్లాడానని చంద్రబాబు సభలోనే చెప్పడం విశేషం. ఈ ప్లాంట్‌కు ప్రత్యేకంగా పైప్‌లైన్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ఒక ప్రైవేటు స్టీల్‌ప్లాంట్‌ కోసం అంతలా తాపత్రయపడుతున్న చంద్రబాబు, పవన్‌లు విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కనీసం నోరెత్తకపోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. దేశంలో ఇతర ప్రాజెక్టులు, అంశాలను ప్రస్తావిస్తూ మోదీపై పొగడ్తల వర్షం కురిపించిన ఇరువురూ.. విశాఖకు సంబంధించి ఒక అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లకపోవడం గమనార్హం.

‘ఉక్కు’ నిరసనలు.. అరెస్టులు

స్టీల్‌ప్లాంట్‌ భవితవ్యంపై భరోసా ఇవ్వాలని వామపక్ష పార్టీలు, ప్రజా, కార్మిక సంఘాల నాయకులు పట్టుబట్టారు. విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధానితో దీనిపై ప్రకటన చేయించాలని డిమాండ్‌ చేశారు. దీంతో కూటమి ప్రభుత్వం వీరిలో చాలా మందిని గృహ నిర్బంధం చేసింది. ఉక్కుపై లేచిన నోర్లను మూయించే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కొంత మంది మద్దిలపాలెం, ఇతర ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో వారిని అరెస్టులు చేయించింది.

సభకు హాజరైన జనం

‘ఉక్కు’పై నోరుమెదపని సీఎం, డీసీఎం

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగ, కార్మిక సంఘాలు 1,427 రోజులుగా నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నాయి. ప్రధాని మంత్రి విశాఖ పర్యటన సందర్భంలో అయినా ఉక్కు పరిశ్రమ పరిరక్షణపై భరోసా వస్తుందని అందరూ భావించారు. స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనంపై ప్రధానితో ఒక ప్రకటన చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌లను కార్మిక సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. గత మూడు రోజులుగా బైక్‌ ర్యాలీలు, ఆందోళనలు చేపట్టారు. పీఎం సభలో స్టీల్‌ప్లాంట్‌పై ఒక భరోసా వస్తుందని ఆశపడ్డారు. కానీ ఇవేవీ చంద్రబాబు, పవన్‌లకు వినిపించలేదు. బహిరంగ సభలో ఇద్దరి నోటా స్టీల్‌ప్లాంట్‌ మాట వినిపించలేదు. ఉక్కు పరిశ్రమపై భరోసా ఇవ్వాలని కనీసం అడిగే ధైర్యం కూడా చేయలేదు.

నగర ప్రథమ పౌరురాలికి

అవమానం

గర ప్రథమ పౌరురాలు మేయర్‌ హరి వెంకట కుమారికి ఘోర అవమానం జరిగింది. ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు కనీసం కూటమి ప్రభుత్వం ఆహ్వానించలేదు. వాస్తవానికి ప్రముఖులు ఎవరు వచ్చినా ప్రథమ పౌరురాలిగా రాజకీయాలు, పార్టీలకు సంబంధం లేకుండా గౌరవించాలి. ఇందుకు భిన్నంగా ప్రధాని నగరానికి వచ్చినప్పటికీ అధికారులు కనీస సమాచారం కానీ ఆహ్వానం కానీ ఇవ్వకపోవడం గమనార్హం. అయితే చివరికి వీడ్కోలు పలికే సమయానికి మాత్రం రావాలంటూ కబురు పంపినట్లు తెలుస్తోంది. బీసీ మహిళ పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు విమర్శల పాలవుతోంది.

విశాఖ అభివృద్ధి ప్రస్తావన లేదు

ప్రధాని మోదీ సభలో విశాఖ అభివృద్ధి ప్రస్తావన లేకుండా పోయింది. ప్రధానంగా మెట్రో రైలు ప్రాజెక్టుకు గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం డీపీఆర్‌ను సైతం సిద్ధం చేసింది. దీనికి నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరింది. తాజాగా ప్రధాని మోదీ విశాఖ వచ్చిన సందర్భంలో మెట్రో ప్రాజెక్టుపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ చంద్రబాబు గానీ, పవన్‌ కల్యాణ్‌ గానీ మెట్రో రైలు ప్రాజెక్టును కూడా ప్రస్తావించలేదు. అలాగే వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో శంకుస్థాపన జరిగి నిర్మాణంలో ఉన్న భోగాపురం విమానాశ్రయ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విశాఖ నుంచి ఈ ఎయిర్‌పోర్టుకు వేగవంతంగా చేరుకునేందుకు వీలుగా కనెక్టివిటీ రహదారుల అభివద్ధికి గత ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. దానిపై కూడా చంద్రబాబు నోరెత్తలేదు. విశాఖకు సంబంధించి ఒక ప్రాజెక్టు ప్రస్తావన లేకుండానే సభను ముగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
పరస్పర భజన1
1/2

పరస్పర భజన

పరస్పర భజన2
2/2

పరస్పర భజన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement