![కోడ్..](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10vscp112-600486_mr-1739215663-0.jpg.webp?itok=JCpktmtP)
కోడ్..
డోంట్ కేర్!
● 13న ఏపీఎంఎస్‌ఈఎఫ్‌సీ రీజినల్ సమావేశం ● ఎన్నికల కోడ్ ఉన్నా హడావుడిగా నిర్వహణకు ఏర్పాట్లు ● జిల్లా పరిశ్రమల కేంద్రానికి రావాలంటూ ఎంఎస్‌ఎంఈ యాజమాన్యాలకు పిలుపు ● కీలక ఆర్థిక పరమైన వ్యవహారాలు చక్కబెట్టేందుకు సన్నాహాలు
సాక్షి, విశాఖపట్నం : ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డు వస్తోంది.. కానీ పరిశ్రమల ఆర్థిక సమస్యలు పరిష్కరించేందుకు మాత్రం ఎటువంటి అడ్డంకి కాదంట. ఎందుకంటే ప్రజా సమస్యలు పరిష్కరిస్తే పైసా రాదు.. అదే ఎంఎస్‌ఎంఈ సమస్యలు పరిష్కరిస్తే కాసులు రాలుతాయి. అందుకే కోడ్ పక్కనపెట్టి కీలకమైన కౌన్సిల్ సమావేశానికి జిల్లా పరిశ్రమల శాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న కలెక్టర్ కూడా ఇందుకు అడ్డుచెప్పకపోవడం అనేక విమర్శలకు తావిస్తోంది.
ఎంఎస్‌ఎంఈ సమస్యల
పరిష్కారానికి కౌన్సిల్
ఇండస్ట్రీస్ డిపార్ట్‌మెంట్ పరిధిలో ఉండే సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)కు సంబంధించి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేశారు. ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌లో ఉత్పత్తుల తయారీకి సంబంధించి మెటీరియల్ సప్లయ్ చేసినా డబ్బులు చెల్లించకపోవడం.. ఉత్పత్తులు డెలివరీ చేసినా నిర్ణీత సమయంలో చెల్లింపులు జరపకపోయినా ఫిర్యాదులు చేసేందుకు ఏపీ స్టేట్ మైక్రో స్మాల్ ఎంటర్ ప్రైజెస్ ఫెసిలిటేషన్ కౌన్సిల్ (ఏపీఎంఎస్‌ఈఎఫ్‌సీ) పనిచేస్తుంది. ఈ ఫెసిలిటేట్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేస్తే సదరు కంపెనీకి సంబంధించిన అంశాలపై విచారణ చేపట్టి బిల్లులు చెల్లించేలా తీర్పులు ఇస్తుంటారు. గతంలో మంగళగిరిలోని డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా కలిపి ఈ కౌన్సిల్‌ను నిర్వహించేవారు. ఇప్పుడు రీజినల్ లెవల్‌లో నిర్వహిస్తున్నారు. ఉత్తరాంధ్రతో పాటు ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించి విశాఖపట్నంలోని జిల్లా పరిశ్రమల కేంద్రంలో కౌన్సిల్ సమావేశం జరుగుతుంటుంది.
కోడ్ ఉల్లంఘించి మరీ..
తాజాగా కోస్తా రీజియన్ కౌన్సిల్ నిర్వహించేందుకు హడావుడిగా ఏర్పాట్లు చేశారు. వారం రోజుల క్రితం జీఎం ఆధ్వర్యంలో ఫిర్యాదులు చేసిన పరిశ్రమలకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 13న ఉదయం 11 గంటల నుంచి ఏపీఎంఎస్‌ఈఎఫ్‌సీ కౌన్సిల్ నిర్వహించనున్నామని, ప్రతి ఒక్కరూ విధిగా హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో కౌన్సిల్ ఏర్పాటు చెయ్యడంపై పారిశ్రామిక వేత్తలు కలవరపడుతున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించామని తమ మీద కూడా కేసులు నమోదు చేస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై పరిశ్రమల శాఖ అధికారులను కొందరు ఎంఎస్‌ఎంఈ ప్రతినిధులు సంప్రదిస్తే అవన్నీ తాము చూసుకుంటాం.. మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుసు కదా అన్నట్లుగా సమాధానమివ్వడంతో విస్తుపోయారు.
లోపాయికారి ఒప్పందాలతో..
సమావేశంలో ఎంఎస్‌ఎంఈల బిల్లుల సెటిల్‌మెంట్లకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఈ బిల్లుల ఫిర్యాదులకు సంబంధించి పరిశ్రమల శాఖ అధికారులు లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నట్లు సమాచారం. అందుకే కోడ్ ఉన్నా పట్టించుకోకుండా ఎలాగైనా కౌన్సిల్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న కలెక్టర్ కూడా కౌన్సిల్ రద్దు చేయాలని ఆదేశించకపోవడం గమనార్హం. ప్రతి సోమవారం ప్రజల నుంచి వినతులు స్వీకరించే గ్రీవెన్స్‌తో పాటు జిల్లా పరిశ్రమల శాఖ పరిధిలో ప్రతి నెలా నిర్వహించే ఆర్థిక పరమైన నిర్ణయాల సమీక్ష సమావేశాన్ని కూడా రద్దు చేసేశారు. కానీ ఏపీఎంఎస్‌ఈఎఫ్‌సీ రీజినల్ సమావేశం మాత్రం రద్దు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment