పోలీసులు అరెస్ట్ చేసిన భార్యాభర్తలు
విజయనగరం: ఆంధ్రా యూనివర్సిటీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఒక్కో ఉద్యోగానికి రూ.3లక్షల నుంచి రూ.6లక్షల వరకు నిరుద్యోగుల నుంచి వసూలు చేసి సుమారు రూ.2కోట్లతో పరారైన దంపతులను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి తెర్లాం ఎస్సై ఆర్.రమేష్ బుధవారం తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పెరుమాళి గ్రామానికి చెందిన బేరి గంగాధర్, భార్య పూర్ణచందనలు ఏయూలో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిపై ఉద్యోగాలు వేయిస్తామని నమ్మించి వారి బంధువుల వద్ద, వేరే ప్రాంతాలకు చెందిన ఇతరులు, మధ్యవర్తుల వద్ద ఏడాది క్రితం సుమారు రూ.2కోట్లకు పైగానే వసూలు చేశారు.
ఉద్యోగాలు వేయిస్తామని డబ్బులు తీసుకున్న వారిలో ఒకరిద్దరికి ఆంధ్రా యూనివర్సిటీలో ఉద్యోగం ఇచ్చినట్లు నకిలీ నియామక పత్రం, ఇడెంటిటీకార్డులు చూపించగా చాలామంది ఉద్యోగాలు వస్తాయని ఆశపడి వారు అడిగినంత ఇచ్చారు. డబ్బులు తీసుకున్న తరువాత ఎప్పటికీ ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో మాకు ఉద్యోగాలైనా ఇవ్వండి, లేదా డబ్బులైనా ఇవ్వండని గంగాధర్, భార్య పూర్ణచందనను బాధితులతోపాటు, మధ్యవర్తులుగా ఉండి డబ్బులు ఇప్పించిన వారు విశాఖపట్నంలో వారు నివాసముంటున్న ఇంటికి వెళ్లి డిమాండ్ చేశారు. కొద్దిరోజుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, లేదంటే డబ్బులు తిరిగి ఇస్తామని నమ్మించి అక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు భార్యాభర్తలిద్దరూ పరారయ్యారు.
దంపతుల కదలికపై నిఘా
దీంతో బాధితుల్లో కొంతమంది తెర్లాం పోలీస్‌స్టేషన్‌లో కొన్ని నెలల క్రితం ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఉన్న ఎస్సై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తరువాత బదిలీపై వెళ్లిపోయారు. ఆ తరువాత తెర్లాం ఎస్సై విధుల్లో చేరిన ఆర్.రమేష్ ఈ కేసుపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. గంగాధర్, ఆయన భార్య కదలికలపై నిఘా వేసి వారు రాజస్థాన్‌లో ఉన్నట్టు తెలుసుకుని బాధితుల్లో ఒకరిని, సిబ్బందిని అక్కడికి పంపించి వారిని పట్టుకుని మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఎస్సై రమేష్ ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలియజేసి, భార్యభర్తలను మంగళవారం అరెస్ట్ చేసి బొబ్బిలి కోర్టుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment