చెరువులో మునిగి విద్యార్థి మృతి
రాజాం సిటీ: నీ కుమారుడు పాఠశాలలో అందరికంటే బాగా చదువుతున్నాడు. చదువు మద్యలో నిలిపివేయకుండా చదివించమ్మ అని ఉపాధ్యాయులు అంటుంటే ఆ తల్లి ఉబ్బితబ్బిబ్బయ్యేది. చదువులో చురుగ్గా ఉన్న కుమారుడు ప్రయోజకుడై ఆదుకుంటాడనుకుంటుండగా కుమారుడు అకాల మరణం చెందాడన్న విషయం తెలుసుకున్న ఆ తల్లి జీర్ణించుకోలేక గుండెలవిసేలా రోదిస్తోంది. ఈ విషాదకర ఘటన రాజాం మండల పరిధి కంచరాం గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన పుల్లేటికుర్తి కృష్ణవేణికి బిడ్డ పుట్టిన ఏడాదికే ఆమె భర్త మరణించాడు. అప్పటి నుంచి కృష్ణవేణి ఓ జ్యూట్‌ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఒక్కగానొక్క కుమారుడు భాస్కరరావు (14)ను అల్లారుముద్దుగా పెంచుతూ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి చదివిస్తోంది. ఆదివారం సెలవు కావడంతో తోటి స్నేహితులతో కలిసి భాస్కరరావు రాజయ్యపేట గ్రామ సమీపంలోని రాజుగారి కోనేరులో స్నానానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోతుండగా అటుగా వెళ్లిన స్థానికులు గమనించి కాపాడే ప్రయత్నం చేశారు. భాస్కరరావును ఒడ్డుకు తీసి సపర్యలుచేసిన అనంతరం రాజాం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా అప్పటికే విద్యార్థి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో తల్లితో పాటు ఇతర కుటుంబసభ్యులు లబోదిబోమంటూ గుండెలు బాదుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్సై జనార్దనరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment