లక్ష్య సాధనపై గురి పెట్టాలి
సీతానగరం: చదువుతో పాటు క్రీడల్లో రాణించేందుకు ఉన్నతమైన లక్ష్యంపై విద్యార్థులు గురిపెట్టి కఠోర శ్రమతో సాధించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ పేర్కొన్నారు. సీతానగరం మండలంలోని జోగింపేట డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలుర గురుకులం మైదానం వద్ద జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి 68వ విలువిద్య స్కూల్‌గేమ్స్ పోటీలు ఆదివారం ఉల్లాసంగా ప్రారంభమయ్యాయి. పదమూడు జిల్లాల నుంచి పాల్గొన్న అండర్ 14, 17, 19 విభాగాల బాలురు, బాలికల విలువిద్య పోటీల ఏర్పాట్లను కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించి క్రీడాకారుల్లో ఉత్తేజాన్ని నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూల్‌గేమ్స్ విలువిద్య పోటీలకు మన్యం జిల్లా ఆతిథ్యం ఇవ్వడం ఆనందదాయకమన్నారు.
ఈ ప్రాంత విద్యార్థులు క్రీడల్లో ఆసక్తి కనబరిచి ప్రతిభ చూపేందుకు మంచి అవకాశమని అభిప్రాయ పడ్డారు. సామర్థ్యాన్ని, అవకాశాలను ఏ మాత్రం వృథా చేసుకోకుండా క్రీడాకారులు ఏకాగ్రతతో నైపుణ్యాన్ని మెరుగుపరచుకుంటే విజయం దాసోహం అవుతుందంటూ వారిలో స్ఫూర్తి నింపారు. నిర్వాహకులు క్రీడాకారులకు కల్పించిన ఏర్పాట్లపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్ర విలువిద్య అసోసియేషన్ అధ్యక్షుడు చెరుకూరి సత్యనారాయణను కలెక్టర్ సన్మానించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి ఎన్.తిరుపతినాయుడు, విలువిద్య రాష్ట్ర పరిశీలకుడు ఎన్.వి.రమణ, ఉప విద్యాశాఖాధికారి రాజ్‌కుమార్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వరరావు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ ఎం. మురళీకృష్ణ, సీతానగరం, పార్వతీపురం మండల విద్యాశాఖ అధికారులు సూరిదేముడు, కర్రి ప్రసాదరావు, ప్రిన్సిపాల్ జేవీఎస్.మధుబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment