No Headline
విజయనగరం ఫోర్ట్:
జిల్లా ప్రజల చిరకాల కోరిక వైద్య కళాశాల. దీన్ని గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నెరవేర్చింది. 2019లో అధికారం చేపట్టిన తరువాత జిల్లాకు గాజులరేగ సమీపంలో 70 ఎకరాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేసింది. రూ.500 కోట్లతో వైద్య కళాశాల, బోధనాస్పత్రి, హాస్టల్ భవనాల నిర్మాణ పనులు ప్రారంభించింది. వైద్య కళాశాలను కూడా ప్రారంభించింది. మొదటి ఏడాది ఎంబీబీఎస్ తరగతులు పూర్తయి రెండో ఏడాది తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. ఇక్కడ 150 మంది విద్యార్థులకు సీట్లు కూడా లభించాయి. గత ప్రభుత్వ హయాంలో శరవేగంగా జరిగిన పనులు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక నత్తనడకన సాగుతున్నాయి. ముఖ్యంగా బోధనాస్పత్రి నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయి. పాలకులు దీనిపై శ్రద్ధ కనబరచడం లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
సర్వజన ఆస్పత్రిని తరలించేందుకు ఇష్టం లేకే...
జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ సమీపంలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఉంది. దీన్ని శాశ్వతంగా ఇక్కడే ఉంచేందుకు అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఇంజినీరింగ్ అధికారులతో ఇటీవల నిర్వహించిన సమావేశంలో సదరు ప్రజాప్రతినిధి సర్వజన ఆస్పత్రిని ప్రస్తుతం ఉన్న చోటే ఉంచేందుకు.. అవసరమైతే అదనపు భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ వైద్య కళాశాల వద్ద ఆస్పత్రి నిర్మాణం పూర్తయితే సర్వజన ఆస్పత్రిని అక్కడకు తరలించాలి. నిబంధనల ప్రకారం ఆస్పత్రి, వైద్య కళాశాల రెండూ ఒకే చోట ఉండాలి. కానీ ఆ విధంగా చేయడానికి అధికార పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఇష్టపడడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఇలా పనుల విషయంలో కాలయాపన చేస్తున్నారని సమాచారం.
వైద్య విద్యార్థుల అవస్థలు
వైద్య కళాశాల ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి సుమా రు ఐదు కిలోమీటర్ల దూరం ఉండడంతో రోజూ వైద్య కళాశాల నుంచి విద్యార్థులు ఆస్పత్రికి వస్తున్నారు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. రెండూ ఒకే చోట ఉంటే వారికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ప్రొఫెసర్లు కూడా వైద్య కళాశాలకు, సర్వజన ఆస్పత్రికి తిరగాల్సిన అవసరం ఉంటుంది. రెండూ ఒకే చోట ఉంటే ఈ అవస్థలు తప్పుతాయి.
Comments
Please login to add a commentAdd a comment