రామతీర్థంలో వైభవంగా పూర్ణాహుతి
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో పూర్ణా హుతి కార్యక్రమాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. యాగశాలలో గత నెల 25 నుంచి గురువారం వరుకు నిర్వహించిన సుందరాకాండ హవనానికి అర్చకులు పూర్ణాహుతి జరిపించారు. వేకువజామున ప్రాతఃకాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో సుందరాకాండ హవనం జరిపించి పుష్యమి నక్షత్రం సందర్భంగా రామాయణంలో పట్టాభిషేక సర్గ హవనం చేపట్టారు. అనంతరం పూర్ణాహుతి జరిపించి ఆస్థాన మండపం వద్ద స్వామి వారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓ వై శ్రీనివాసరావు, సిబ్బంది రామారావు, తులసి, భక్తులు పాల్గొన్నారు.
ఇంటి పన్ను బకాయిల వసూలుకు చర్యలు
● జిల్లా పంచాయతీ అధికారి
టి.వెంకటేశ్వరరావు
తెర్లాం: జిల్లాలో ఇంటి పన్ను బకాయిలు రూ.19.6 కోట్లకు రూ.6.78 కోట్లు వసూలైందని, మిగిలిన బకాయిల వసూలుకు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) టి.వెంకటేశ్వరరావు తెలిపారు. తెర్లాం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రేగి రాంబాబు సమక్షంలో గురువారం జరిగిన పంచాయతీ కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వర్ణభారతి యాప్‌లో జిల్లాలోని అన్ని ఇళ్ల వివరాలను నమోదుచేస్తున్నట్టు వెల్లడించారు. జిల్లాలో 4లక్షల16వేల ఇళ్లను స్వర్ణభారతి యాప్‌లో పంచాయతీ కార్యదర్శులు అప్‌లోడ్ చేయాల్సి ఉందన్నారు. దీనివల్ల ఇంటిపన్ను ఆన్‌లైన్‌లో చెల్లించుకునే వెసులబాటు కలుగుతుందన్నారు. ఈ నెల 25లోగా యాప్‌లో ఇళ్ల వివరాలను ఆన్‌లైన్ చేసే ప్రక్రియను పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. తెర్లాం మండలంలో 13,431ఇళ్లను యాప్‌లో నమోదుచేయాల్సి ఉందన్నారు. పల్లెల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ రాంబాబు, ఈఓపీఆర్‌డీ నీలిమ, తదితరులు పాల్గొన్నారు.
కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ
విజయనగరం అర్బన్: జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చేనెల 2 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని జిల్లా పౌరసరఫరాల అధికారి డి.మధుసూదనరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం స్వీకరించే దరఖాస్తులతో పాటు ఈ ఏడాది జనవరి నుంచి మార్చినెల వరకు చేసుకున్న దరఖాస్తులు పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తామన్నారు. సంక్రాంతి కానుకగా ప్రభు త్వం కొత్తరేషన్ కార్డులను మంజూరు చేయనుందని పేర్కొన్నారు.
క్షేత్రస్థాయిలో వినతుల పరిష్కారం
విజయనగరం అర్బన్: జిల్లాలో ఇకపై ప్రతి సోమవారం మండల, మున్సిపల్, డివిజన్ స్థాయిల్లో ప్రజా వినతుల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ గురువారం సూచించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని వెల్లడించారు. మండల స్థాయిలో నిర్వహించే ప్రజా వినతుల పరిష్కారవేదిక కార్యక్రమాన్ని ఎంపీడీఓ, తహసీల్దార్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ తదితరులతో కూడిన మండల స్థాయి సమన్వయ కమిటీ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. వివిధ శాఖల సమన్వయంతో పరిష్కారం కావలసిన సమస్యలపై చర్చించేందుకు ఇంటర్ డిపార్టెంటల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంటుందన్నారు. మండల స్థాయిలో ప్రజల నుంచి వచ్చే వినతుల పరిష్కారంపై మండల స్థాయి అధికారులకు ఆదేశాలు, సూచనలు ఇచ్చేందుకు సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులు తమ పరిధిలోని మండల అధికారులతో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని చెప్పారు. డివిజన్ మండల స్థాయి అధికారులతో ప్రజా వినతుల పరిష్కారంపై సమన్వయం చేసేందుకు కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సమన్వయ అధికారిగా వ్యవహరిస్తారని జేసీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment