లారీ ఢీకొని ఏఎన్‌ఎంకు తీవ్రగాయాలు
రామభద్రపురం: మండలంలోని కొట్టక్కి వద్ద జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో ఏఎన్‌ఎంకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు మేరకు స్థానిక పీహెచ్‌సీలో పనిచేస్తున్న ఆరికతోట గ్రామానికి చెందిన యజ్జల నీరజా రాణి వైద్యసేవల నిమిత్తం భర్త మోహనరావుతో కలిసి ద్విచక్రవాహనంపై కొట్టక్కి వెళ్తున్నారు. సరిగ్గా సాలూరు, కొట్టక్కి జంక్షన్ వద్దకు వెళ్లి కొట్టక్కి గ్రామానికి తిరుగుతున్న సమయంలో వెనుకనుంచి వచ్చిన లారీ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో నీరజ రోడ్డుపై వెనక్కి పడిపోగా భర్త బయటకు తుళ్లిపడ్డాడు. ఈ ప్రమాదంలో నీరజ తలకు బలమైన గాయం కాగా భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స నిమిత్తం స్థానికులు వెంటనే ఆమెను సాలూరు సీహెచ్‌సీకి తరలించి అనంతరం విజయనగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడ చికిత్స పొందుతోంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై వి. ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బర్లి ఫీల్డ్ అసిస్టెంట్‌పై ఫిర్యాదు
బలిజిపేట: మండలంలోని బర్లి ఫీల్డ్ అసిస్టెంట్‌పై వచ్చిన ఫిర్యాదులపై ఎంపీడీఓ విజయలక్ష్మి బుధవారం దర్యాప్తు నిర్వహించారు. ఫీల్డ్ అసిస్టెంట్ రమాదేవిపై ఉపాధి వేతనదారులు వివిద అంశాలపై ఇచ్చిన ఫిర్యాదుమేర దర్యాప్తు చేసినట్లు ఎంపీడీఓ తెలిపారు. 42మంది వేతనదారులు స్థానికంగా ఉండడం లేదంటూ పనికల్పించడం లేదని, డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ సమయంలో 22మంది మాత్రమే హాజరయ్యారు. వారిలో కొంతమంది సక్రమంగా పనిచేస్తున్నారని, కొందరు డబ్బులు తీసుకుంటున్నారని విచారణ అధికారులకు తెలిపారు. వేరే వర్గం నుంచి 430మంది వేతనదారులు పీల్డ్ అసిస్టెంట్ సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారని, ఆమె వల్ల ఎటువంటి సమస్యలు తలెత్తడం లేదని విచారణ అధికారులకు రాతపూర్వకంగా తెలియజేశారు. ఇరు వర్గాల అభిప్రాయాలను సేకరించి ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు ఎంపీడీఓ విజయలక్ష్మి తెలిపారు. కార్యక్రమంలో ఏపీఓ కేశవరావు, నాయకులు, వేతనదారులు పాల్గొన్నారు.
భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య
భోగాపురం: భర్త వేదింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని లింగాలవలస గ్రామంలో బుధవారం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని లింగాలవలస గ్రామానికి కనకల మధులక్ష్మి(31)కు కొనేళ్లక్రితం అదే గ్రామానికి చెందిన కనకల రామారావుతో వివాహం జరిగింది. వారికి మూడు సంవత్సరాల పాప ఉంది. అయితే కొన్ని రోజులుగా భర్త రామారావు తరచూ మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యను హింసిస్తూ ఉండేవాడు. దీంతో భర్త వేధింపులు మధులక్ష్మి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి కాళ్ల పైడమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఎన్‌వీ ప్రభాకర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment