లారీ ఢీకొని యువకుడి దుర్మరణం
కొమరాడ: మండలంలోని గుమడ వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదంపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం నుంచి రాయగడ వైపు వెళ్తున్న లారీ..పశువులను మేపుకోసం రహదారిపై తోలుకుని వెళ్తున్న యువకుడు దేవుపల్లి భాస్కరరావు(25)ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబానికి అంతా తానై కూలి పనులు చేసి ఆర్థికంగా ఆదుకుంటున్న కొడుకు కళ్ల ముందే మృతి చెందడంతో తల్లిదండ్రులు రాజారావు, లక్ష్మిలు కన్నీరుమున్నీరయ్యారు. దీంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు అంతా కలిసి మృతుడి కుటుంబానికి న్యాయం జరగాలంటూ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రహదారి పక్కనే ఉన్న హరిజన వీధికి ఫుట్‌ఫాత్, సేఫ్టీ గ్రిల్స్, స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రోడ్డుకు ఇరువైపులా ఆర్ అండ్‌బీ స్ధలం అక్రమణ చేశారని రహదారి వెడుల్పు చేసి ప్రమాదాలు నివారించేలా చర్యలు చేపట్టాలని కోరారు. మృతుడి కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుల ఆందోళనతో అంతర్రాష్ట్ర రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ఈ సమాచారంతో పార్వతీపురం సీఐ ఎస్.గోవిందరావు, స్థానిక ఎస్సై నీలకంఠం ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. ఆనంతరం ఆర్‌అండ్ బీ డీఈ అప్పాజీ చేరుకుని సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారిస్తామని చెప్పారు. వెంటనే గ్రామస్తులు ఆందోళన విరమించగా పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని మరొకరు..
రామభద్రపురం: రోజు వారీ చేస్తున్న విధులు ముగించుకుని ఇంటికి వస్తూ మరో రెండు నిమషాల్లో చేరుకుంటాడనగా గుర్తు తెలియని వాహనం రూపంలో మృత్యువు కాటేసింది. దీంతో రామభద్రపురం మండలకేంద్రంలో విషాదఛాయలు అలముకున్నాయి. అలాగే ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం దిక్కులేనిదైంది. కొద్ది సేపట్లో ఇంటికి వస్తాడనుకున్న భర్త మృతిచెందాడన్న సమాచారం తెలియగా భార్యా పిల్లల రోదన అంతా ఇంతాకాదు. ఈ ప్రమాదంపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలకేంద్రంలోని గొల్లవీధికి చెందిన శనగల మురళీకృష్ణ(31) బొబ్బిలిలోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. రోజులాగానే మంగళవారం రాత్రి 11.30 గంటలకు తన ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తుండగా సాలూరు వెళ్లే బైపాస్ రోడ్డులో పెదపల్లి వీధి, కనిమెరక వీధి మధ్య జంక్షన్ వద్ద గుర్తు తెలియని వాహనం బలంగా ఢీ కొట్టింది. దీంతో మురళీకృష్ణ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ వచ్చే సమయానికే మృతిచెందడంతో పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్‌సీకి మృతదేహాన్ని తరలించారు. బుధవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఎస్సై వి.ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రహదారిపై గ్రామస్తుల బైఠాయింపు
స్తంభించిన ట్రాఫిక్
Comments
Please login to add a commentAdd a comment