పవన్‌ మాట పొల్లేనా? | - | Sakshi
Sakshi News home page

పవన్‌ మాట పొల్లేనా?

Published Thu, Dec 19 2024 7:26 AM | Last Updated on Thu, Dec 19 2024 10:54 AM

పవన్‌ మాట పొల్లేనా?

పవన్‌ మాట పొల్లేనా?

సాక్షి ప్రతినిధి, విజయనగరం: గుర్ల డయేరియా మృతుల కుటుంబాలంటే టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వానికి ఇప్పటికీ చిన్నచూపే! జిల్లా కేంద్రానికి కేవలం 20 కిలోమీటర్లు దూరంలో ఉన్న గుర్ల మండలాన్ని రెండు నెలల కిందట డయేరియా వణికించిన సంగతి తెలిసిందే. 250 మందికి పైగా ఈ వ్యాధి బారినపడ్డారు. 13 మంది రెండు వారాల వ్యవధిలోనే పిట్టల్లా రాలిపోయారు. తల్లి మృతిని తట్టుకోలేక మనోవేదనతో మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఒకే ప్రాంతంలో, స్వల్ప కాల వ్యవధిలో ఇంతమంది చనిపోయినా సర్కారులో స్పందన తూతూమంత్రమే. కంటితుడుపు చర్యగా అక్టోబర్‌ నెల 21వ తేదీన ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ గుర్లలో పర్యటించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడారు. డయేరియా ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న రోగులనూ పరామర్శించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష పెట్టారు. ప్రభుత్వం నియమించిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ నివేదిక ఇచ్చిన వెంటనే ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం నుంచి ఇప్పిస్తానని చెప్పారు. అది ఆలస్యమైతే వెంటనే తన సొంత నిధుల నుంచి రూ.లక్ష చొప్పున పది మంది కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తానని పవన్‌ ప్రకటించారు. ఆహా ఓహో అని కూటమి నాయకుల చప్పట్లు ఇంకా బాధిత కుటుంబాల చెవుల్లో రింగ్‌మంటూనే ఉన్నాయి. ఆయన వెళ్లిన రెండ్రోజులకే జిల్లా ఇన్‌చార్జి మంత్రి, హోంమంత్రి వంగలపూడి అనిత కూడా మొక్కుబడి తంతుగా వచ్చివెళ్లారు. ఇంత హడావుడి చేసినా డయేరియా బాధిత కుటుంబాలకు మాత్రం ఊరట లభించలేదు. దాదాపు రెండు నెలలవుతున్నా ఆ పది కుటుంబాలకు పవన్‌ ప్రకటించిన రూ.లక్ష సాయం అందలేదు. కూటమి సర్కారు ఇవ్వాల్సిన ఎక్స్‌గ్రేషియా ఊసూలేదు.

కన్నెత్తి చూడని చంద్రబాబు..

డయేరియా ఒక్క గుర్ల మండలంలోనే 13 మంది బలిగొన్నా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. విజయానంద్‌ కమిటీ నివేదికకు అతీగతీ లేదు. మృతుల కుటుంబాలకు కనీసం ఎక్స్‌గ్రేషియా గురించి ఒక్క ప్రకటనా చేయలేదు. సరికదా... ఇటీవల జిల్లా కలెక్టర్ల రెండ్రోజుల సమావేశంలో సరికొత్త పల్లవి ఎత్తుకున్నారు. జిల్లా అధికార యంత్రాంగం పాలనా వైఫల్యం, అసమర్థత వల్లే అతిసార (డయేరియా) ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయంటూ నెపం అధికారులపై నెట్టేశారు. వారంతా ప్రభుత్వంలో భాగమే అన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించి, తప్పు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇక ఆశలన్నీ పవన్‌పైనే....

జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌పైనే బాధిత కుటుంబాలు ఆశలు పెట్టుకున్నాయి. ఆయన ఉమ్మడి విజయనగరం జిల్లా పర్యటనకు వస్తున్నారు.. అదిగో ఇదిగో అని కూటమి నాయకులు హడావిడి చేస్తున్న నేపథ్యంలో ఎక్స్‌గ్రేషియాపై చర్చ సాగుతోంది. ఇచ్చిన మాట ప్రకారం రూ.లక్ష అయినా ఇస్తారా? లేదా ప్రభుత్వంతో మాట్లాడి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషి యా అయినా ఇప్పిస్తారా? అనే ఆశతో ఉన్నారు. ఏం చేస్తారో, ఏం చెబుతారో వేచిచూడాలి.

ఇచ్చిన మాట ప్రకారం..

మాటలు కాదు చేతల్లో చూపించే జననాయకుడని ప్రతిపక్షనేత వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి డయేరియా బాధిత కుటుంబాల గుండెల్లో నిలిచిపోయారు. ఆయన అక్టోబర్‌ 24న గుర్లలో పర్యటించినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం 13 మంది మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున అందజేశారు. అందుకు సంబంధించిన చెక్కులను ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఎత్తేసిన వెంటనే గత నెలలోనే శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఆయా కుటుంబాలకు అందించిన సంగతి తెలిసిందే.

గుర్ల డయేరియా మృతుల కుటుంబాలకు సర్కారు మొండిచేయి!

పది మంది మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సాయం చేస్తానని

ఉపముఖ్యమంత్రి పవన్‌ హామీ

రెండు నెలలవుతున్నా హామీ, అభయంపై నోరుమెదపని వైనం

ఇచ్చిన మాట ప్రకారం మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సాయం

రూ.2 లక్షల చొప్పున 13 కుటుంబాలకు ఆర్థిక సాయం

త్వరలోనే ఉమ్మడి విజయనగరం జిల్లాకు రానున్న పవన్‌?

ఇప్పటికై నా ఎక్స్‌గ్రేషియా ఇస్తారో లేదోనని బాధిత కుటుంబాల ఎదురుచూపు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement