కేసుల రాజీలో అద్వితీయం
విజయనగరం క్రైమ్: జాతీయలోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారంలో జిల్లా పోలీస్ శాఖకు రాష్ట్ర డీజీపీ నుంచి ప్రశంసలు లభించాయి. కేసులు రాజీ కుదర్చడంలో రాష్ట్రస్థాయిలోనే విజయనగరం ద్వితీయ స్థానంలో నిలిచింది. 5,345 కేసులను రాజీ కుదర్చడంలో క్రియాశీలకంగా పనిచేసిన ఎస్పీ వకుల్ జిందాల్‌తో పాటు భోగాపురం రూరల్ సీఐ జి.రామకృష్ణ, డీసీఆర్‌బీ ఎస్‌ఐ కె.రాజేష్, నెల్లిమర్ల హెచ్‌సీ కె.సన్యాసినాయుడు, టూటౌన్ కానిస్టేబుల్ ఐ.శ్రీనివాసరావును రాష్ట్ర డీజీపీ సీహెచ్.ద్వారకాతిరుమలరావు బుధవారం తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసాపత్రాలు, ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదై, లోక్ అదాలత్‌లో పరిష్కారానికి అర్హత కలిగిన కేసులను ముందుగా గుర్తించి, ఆయా కేసుల్లో ఫిర్యాదిదారులు, కక్షిదారుల మధ్య సమన్వయం సాధించేందుకు క్షేత్రస్థాయిలో చక్కని ప్రణాళికతో పనిచేశామన్నారు. న్యాయస్థానాల విలువైన సమయాన్ని ఆదా చేయడంతో పాటు స్వల్ప వివాదాలు, క్షణికావేశంపై నమోదైన కేసుల్లో ఇరువర్గాలను డిసెంబర్ 14న నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో ప్రవేశపెట్టడం, న్యాయస్థానం మందు హాజరై, ఇరువర్గాలు రాజీపడినట్లుగా చేయడంతో అధిక కేసులు పరిష్కరించగలిగామన్నారు. వివిధ పోలీస్ స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌లుగా నమోదైన 1192 కేసులతో సహా 4,153 ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసులను పరిష్కరించామని వివరించారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో పోలీస్ అధికారులు, సిబ్బంది పనిచేయాలని, జిల్లాను అన్ని రంగాల్లోనూ ప్రథమస్థానంలో నిలిపేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ మెగా లోక్ అదాలత్‌లో 17,138 కేసులు డిస్పోజల్ కాగా, వాటిలో విజయనగరం జిల్లా పోలీసులు 5,345 కేసులను డిస్పోజ్ చేసి, రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచారన్నారు. ప్రథమ స్థానంలో కర్నూల్, తృతీయస్ధానంలో కృష్ణా జిల్లాలు నిలిచాయని తెలిపారు. కార్యక్రమంలో సీఐడీ అడిషనల్ డీజీ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్, లా అండ్ ఆర్డర్ ఐజీ సీహెచ్ శ్రీకాంత్, రైల్వే, స్పోర్ట్స్ ఐజీ కె.వి.మోహనరావు, ఈగల్ ఐజీ రవికృష్ణ, ఇతర జిల్లాల ఎస్పీలు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
జాతీయలోక్ అదాలత్‌లో జిల్లాలో
5,345 కేసుల పరిష్కారం
రాష్ట్రస్థాయిలో జిల్లాకు రెండో స్థానం
కేసుల పరిష్కారంలో కీలక భూమిక పోషించిన జిల్లా పోలీస్ శాఖ
ఎస్పీ వకుల్‌జిందాల్, పోలీసులను అభినందించిన డీజీపీ
Comments
Please login to add a commentAdd a comment