అక్రమ కల్వర్టు నిర్మాణంపై ప్రశ్నిస్తే... తహసీల్దార్ కస
సాక్షి ప్రతినిధి, విజయనగరం/గజపతినగరం:
ప్రభుత్వ భూములను, ప్రజాస్థలాలను పరిరక్షించండి... అక్రమ కట్టడాలను అడ్డుకోండి మహాప్రభో అని వేడుకుంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఓ ప్రజాప్రతినిధికి తీవ్ర అవమానం ఎదురైన ఘటన గజపతినగరం తహసీల్దార్ కార్యాలయంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఏదైనా సమస్యను దృష్టికి తీసుకొచ్చే ప్రజాప్రతినిధులకు సానుకూలంగా స్పందించాల్సిన అధికారులు ఇలా పరుష పదజాలంతో దూషించడం గర్హనీయమని వైఎస్సార్‌సీపీ గజపతినగరం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఖండించారు. ఇలా ప్రజాప్రతినిధుల పట్ల అధికారుల దుష్ప్రవర్తన కూటమి ప్రభుత్వం వచ్చాక విషసంస్కృతిగా మారుతోందని అన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధుల పట్ల గౌరవంగా చూసేవారని చెప్పారు. అధికారుల్లో ఈ తరహా తీరు సరికాదని, ఒకవేళ సమస్యకు పరిష్కారం తమ పరిధిలో లేకపోతే అదే విషయాన్ని సావధానంగా చెబితే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. అంతేతప్ప తనకు సమస్య చెప్పడానికి కార్యాలయానికి వచ్చిన మధుపాడ సర్పంచ్‌ను గజపతినగరం తహసీల్దారు అగౌరవపరచడాన్ని ఖండిస్తున్నామన్నారు.
ఎందుకీ కల్వర్టు...
మధుపాడ గ్రామ రెవెన్యూ పరిధిలో ఓ ప్రైవేట్ లేఅవుట్‌కు రహదారి వేయాలంటే జీసీ కెనాల్ గట్టుపై కల్వర్టు నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం ఏకంగా కాలువ గట్టును తవ్వేసి ఆ లేఅవుట్ యజమానులే ఈ నిర్మాణ పనులు చేయిస్తున్నారు. ఇందుకోసం ఆ ప్రాంతంలో సర్వే నంబర్లు 46/11, 46/12, 46/13లోని తమ భూములకు రహదారి కోసం కల్వర్టు నిర్మాణానికి చిన్ని ఉషారాణి అనే మహిళా రైతు పేరుతో ఎండార్స్‌మెంట్ తీసుకున్నారని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. గతంలో రెండుసార్లు సర్పంచ్ పైడపునాయుడు ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు పాక్షికంగా తొలగించారు. కానీ ఇరిగేషన్ అధికారుల నుంచి తమకు అనుమతి ఉందని చెబుతూ లేఅవుట్ యజమానులు ఆ కల్వర్టు నిర్మాణ పనులను కొనసాగిస్తున్నారు. ఈ విషయం తెలిసిన చిన్ని ఉషారాణి... గురువారం గజపతినగరం రెవెన్యూ కార్యాలయానికి వచ్చి తహసీల్దారుకు ఫిర్యాదు చేశారు. అక్కడ తనకు భూములు లేవని, తన పేరుతో తప్పుడు ఎండార్స్‌మెంట్ తీసుకున్నారని, దానికి తనకు సంబంధం లేదని ఆమె చెప్పారు. అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
ఇది రెవెన్యూ అధికారులు తొలగించిన చోటే మళ్లీ రాళ్లతో కట్టేసిన గోడ చిత్రం. పంటకాలువలో కల్వర్టు నిర్మాణానికి చిన్ని ఉషారాణి అనే రైతు అభ్యర్థన మేరకు ఎండార్స్‌మెంట్ ఇచ్చినట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. అయితే, అక్కడ తనకు భూములు లేవని, తన పేరుతో అక్రమంగా ఎండార్స్‌మెంట్ తీసుకున్నారని ఆమె గజపతినగరం తహసీల్దార్ పి.రత్నకుమార్‌కు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఇంత జరుగుతున్నా, గతంలో రెండుసార్లు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం ఎంతవరకూ న్యాయమని ప్రశ్నించిన మధుపాడ గ్రామ సర్పంచ్‌పై తహసీల్దార్ తీవ్ర స్వరంతో దూషణలకు దిగారు. ఎహే బయటకు పో... ముందు మర్యాదగా బయటకు పో... అంటూ దురుసు పదజాలంతో తీవ్రంగా అవమానించారు.
ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఒక అక్రమ నిర్మాణం. ఆండ్ర రిజర్వాయరు నుంచి గజపతినగరం మండలంలోని మధుపాడ సహా ఐదు గ్రామాల పరిధిలోని పంట పొలాలకు సాగునీరు అందించే గంగచోళపెంట కాలువ (జీసీ కెనాల్) గట్టును ఆక్రమించి నిర్మిస్తున్న కల్వర్టు ఇది. మధుపాడ గ్రామ రెవెన్యూ పరిధిలో ఓ ప్రైవేట్ లేఅవుట్‌కు రహదారి సదుపాయం కోసం దీన్ని నిర్మిస్తున్నారు. దీనిపై మధుపాడ గ్రామ సర్పంచ్ కడుపుట్ల పైడపునాయుడు ఫిర్యాదు మేరకు గతంలో ఈ పనులను స్థానిక రెవెన్యూ అధికారులు అడ్డుకొన్నారు. పాక్షికంగా తొలగించిన రాళ్లను ఈ చిత్రంలో చూడవచ్చు.
‘ఎహే బయటకు పో’ అంటూ సర్పంచ్‌పై నోటిదురుసు
మధుపాడ గ్రామ ప్రజాప్రతినిధిపై
రుసరుస
ప్రశ్నిస్తే కోపమొచ్చింది...
కల్వర్టు అక్రమ నిర్మాణమని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అడ్డుకోవట్లేదని తహసీల్దార్‌ను సర్పంచ్ పైడపునాయుడు ప్రశ్నించడమే తప్పు అయ్యింది. కోపంతో ముఖం చిట్లిస్తూ తహసీల్దారు రత్నకుమార్ సర్పంచ్‌పై రెచ్చిపోయారు. తమ పరిధిలోని లేని అంశాలను ఎందుకు తీసుకొస్తావంటూ పరుష పదజాలంతో రెచ్చిపోయారు. మర్యాదగా బయటకు పో... ఎహే ముందు బయటకు పో... అంటూ హెచ్చరించడంతో అక్కడున్నవారంతా నిర్ఘాంతపోయారు.
అక్రమ కల్వర్టు నిర్మాణంపై ప్రశ్నిస్తే... తహసీల్దార్ కస
అక్రమ కల్వర్టు నిర్మాణంపై ప్రశ్నిస్తే... తహసీల్దార్ కస
అక్రమ కల్వర్టు నిర్మాణంపై ప్రశ్నిస్తే... తహసీల్దార్ కస
Comments
Please login to add a commentAdd a comment