ఔషధ మూలికలకు అడవే ఆధారం
విజయనగరం అర్బన్: ఔషధ మూలికలకు అడవే ఆధారమని, అక్కడ దొరికే చెట్ల వేళ్లు, బెరడు, ఆకులు, జిగిర్లు వినియోగించి ఆరోగ్యవంతమైన మానవ సమాజాన్ని నిర్మించవచ్చని కేరళకు చెందిన పద్మశ్రీ పురస్కార గ్రహీత, గిరిజన వైద్యురాలు లక్ష్మీ కుట్టి అన్నారు. స్థానిక కేంద్రీయ గిరిజన యూనివర్సిటీలో ‘రీసైలియన్స్ అండ్ రీ కనస్ట్రక్షన్ ఆఫ్ ట్రైబల్ సిస్టం’ అనే అంశంపై రెండురోజుల పాటు నిర్వహించిన జాతీయ సదస్సుకు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీవీ కట్టిమణితో కలిసి ఆమె గురువారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అడవిలో దొరికే చెట్లు, మొక్కలే కాకుండా మట్టి, రాళ్లు, నీరు తదితరమైనవన్నీ వైద్యానికి పనికివస్తాయన్నారు. రోగాన్ని, అవసరాన్ని, వ్యక్తి శరీర ధర్మాన్ని బట్టి మందులు ఇవ్వాలన్నారు. అడవిలో వెళ్తున్నప్పుడు మౌనంగా ఉండే చెట్లు, మొక్కలు, గాలి, నీరు, ప్రకృతి మనతో మాట్లాడతాయని, ఆ స్థితికి వెళ్లినపుడు వనదేవత సహకరిస్తుందని తన అనుభవాలను పంచుకున్నారు. వీసీ కట్టిమణి మాట్లాడుతూ ప్రాచీన గిరిజన విజ్ఞానం విశిష్టమైనదిగా పేర్కొన్నారు. గిరిజనులకు తెలిసిన విజ్ఞానం ప్రకృతి ప్రసాధించినదన్నారు. గ్రహాల గతులు, రుతువులు, పంటలకు సంబంధించిన పరిజ్ఞానం, వివిధ వ్యాధులను గుర్తించడం, దానికి పసరులతో వైద్యం చేయడం వంటి అంశాలపై ప్రస్తుతం ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. అనంతరం ముఖ్యఅతిథిని సత్కరించారు. సోషల్ వర్క్ ట్రైబల్ స్టడీస్, సోషియాలజీ, ఇంగ్లిష్ విభాగాల సంయుక్త నిర్వహణలో జరిగిన సదస్సులో సెమినార్ కన్వీనర్‌గా డాక్టర్ గణేష్, కో–కన్వీనర్లుగా డాక్టర్ దివ్య, డాక్టర్ ప్రమాచటర్జీ నాగ్, డాక్టర్ బాలుమూరి వెంకటేశ్వర్లు వ్యవహరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల డీన్‌లు, విభాగాధిపతులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
గిరిజన వర్సిటీ సదస్సులో పద్మశ్రీ
పురస్కార గిరిజన వైద్యురాలు లక్ష్మీకుట్టి
ప్రాచీన గిరిజన విజ్ఞానం గొప్పది: వీసీ ప్రొఫెసర్ టీవీ కట్టిమణి
Comments
Please login to add a commentAdd a comment