![జిల్లాలో సాగు విస్తీర్ణం పెరగాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07vzg26-370044_mr-1738955457-0.jpg.webp?itok=duMQSV6x)
జిల్లాలో సాగు విస్తీర్ణం పెరగాలి
విజయనగరం అర్బన్: వ్యవసాయ రంగంలో 15 శాతం వృద్ధిరేటు సాధించాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం పెంచే దిశగా వ్యవసాయ, దాని అనుబంధ రంగాల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఏడాది ప్రగతి లక్ష్యాల సాధనపై కలెక్టర్ తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో సాగుకు యోగ్యమై, వినియోగంలో లేని 1.12 లక్షల ఎకరాల భూమిని సాగులోకి తెచ్చే ప్రయత్నం చేయాలని సూచించారు. ఉద్యాన, వాణిజ్య పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలని చెప్పారు. పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు స్థలాలను గుర్తించినట్టు కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో స్వయంశక్తి మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడంలో భాగంగా ప్రధాన రోడ్ల వెంబడి 50 స్టోర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించామని డీఆర్‌డీఏ పీడీ ఏ.కళ్యాణ చక్రవర్తి చెప్పారు. జిల్లా సాంఘిక, బీసీ సంక్షేమ శాఖలకు చెందిన హాస్టళ్ల మరమ్మతు పనులను వెంటనే ప్రారంభించి, వచ్చే విద్యాసంవత్సరంలో హాస్టళ్లు తెరిచేలోగా పూర్తి చేయాలని రోడ్లు భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. ఈ–శ్రమ్ కింద అసంఘటిత రంగ కార్మికుల నమోదు ప్రక్రియలో వివిధ ప్రభుత్వ శాఖల సహకారం తీసుకోవాలని కార్మిక శాఖను ఆదేశించారు. సమావేశంలో జేసీ ఎస్.సేతుమాధవన్, ముఖ్యప్రణాళిక అధికారి పి.బాలాజీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment