బీసీ రిజర్వేషన్లు పెంచాల్సిందే.. | - | Sakshi
Sakshi News home page

బీసీ రిజర్వేషన్లు పెంచాల్సిందే..

Published Sat, Nov 23 2024 12:41 AM | Last Updated on Sat, Nov 23 2024 12:41 AM

బీసీ

బీసీ రిజర్వేషన్లు పెంచాల్సిందే..

జీవనోపాధి చూపాలి:

ఎమ్మెల్యే యెన్నం

బీసీలకు జీవనాధారం చూపించాలని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కోరారు. రాష్ట్రంలో సుమారు 3 కోట్ల మంది బీసీ ఓటర్లు ఉండగా.. ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 5 లక్షలకు మించకుండా ఉందన్నారు. బీసీ బాలుర, బాలికల హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు బాలికల కోసం మరికొన్ని హాస్టళ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. మహబూబ్‌నగర్‌లో మహిళల కోసం కేవలం ఒక డిగ్రీ కళాశాల మాత్రమే ఉందని.. మరో రెండు డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. బీసీ జనాభా ప్రాతిపదికన నిధులను కేటాయించి, వారి సంక్షేమానికి ఖర్చు చేయాలని కోరారు.

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): బీసీ కులాల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని బీసీ సంఘాలు, కుల సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాల్‌లో వెనుకబడిన తరగతుల సామాజిక, ఆర్థిక, విద్య పరమైన స్థితిగతులపై బీసీ కమిషన్‌ ఆధ్వర్యంలో బహిరంగ విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీలు, బీసీ, కుల సంఘాల నాయకుల నుంచి కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ వినతులను స్వీకరించారు. బీసీ క్రిమిలేయర్‌ను ఎత్తివేయాలని పలు సంఘాలు కోరాయి. దీంతో పాటు ఈడబ్ల్యూఎస్‌తో బీసీలకు అన్యాయం జరుగుతుందని.. దాన్ని వెంటనే రద్దు చేయాలని కమిషన్‌ దృష్టికి తీసుకువచ్చారు. రాజకీయ ప్రాతినిధ్యం లేని కులాలు చాలా ఉన్నాయని.. వాటికి కూడా రిజర్వేషన్ల ద్వారా రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి మొత్తం 135 వినతులు వచ్చాయి. బీసీ సంఘాలతో పాటు ముదిరాజ్‌, రజక, నాయీబ్రాహ్మణ, సగర, వడ్డెర, మేదరి తదితర కుల సంఘాలతో పాటు మైనార్టీ సంఘాల నాయకులు వినతిపత్రాలు సమర్పించిన వారిలో ఉన్నారు.

ఇంటింటి సర్వేను సద్వినియోగం చేసుకోండి

ఇంటింటి సర్వేను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ కోరారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కు టుంబ సర్వే చివరి దశకు చేరిందని.. జంట నగరా లు మినహా మిగతా జిల్లాల్లో 85 నుంచి 90 శాతం సర్వే పూర్తయిందన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 94 శాతం, వనపర్తిలో 88 శాతం, నాగర్‌కర్నూల్‌లో 84.2 శాతం, జోగుళాంబ గద్వాలలో 94 శాతం, నారాయణపేట జిల్లాలో 92.5 శాతం సర్వే పూర్తయినట్లు వివరించారు. ఎన్యుమరేటర్లు ఇంటింటికెళ్లి సమాచారం సేకరిస్తున్నారని.. సర్వే వివరాలను పూర్తిగా పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టనున్నట్లు చెప్పారు.

● మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ విజయేందిర మాట్లాడుతూ.. బీసీ కమిషన్‌ బహిరంగ విచారణకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. నాగర్‌కర్నూల్‌, వనపర్తి కలెక్టర్లు బదావత్‌ సంతోష్‌, ఆదర్శ్‌ సురభి మాట్లాడుతూ.. బీసీ కమిషన్‌ ప్రజల వద్దకు వచ్చి ప్రత్యక్షంగా బీసీల సమస్యలను తెలుసుకోవడంతో పాటు ప్రజల అభ్యున్నతికి కృషి చేయడం సంతోషంగా ఉందన్నారు. అంతకుముందు ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో చైర్మన్‌ నిరంజన్‌, సభ్యులు రాపోలు జయ ప్రకాష్‌, తిరునగరి సురేందర్‌, రంగు బాలలక్ష్మిలకు కలెక్టర్‌ విజయేందిర, ఎస్పీ డి.జానకి స్వాగతం పలికారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్‌, మోహన్‌రావు, లక్ష్మీనారాయణ, బీసీ సంక్షేమశాఖ అధికారులు ఇందిర, ఖాజా నజీంఅలీ, సుబ్బారెడ్డి, రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

వివిధ సంఘాల అభిప్రాయాలు..

రాష్ట్ర మైనార్టీ ఆర్థిక కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌ మాట్లాడుతూ.. బీసీ జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. సయ్యద్‌, మొఘల్‌, పఠాన్‌లు ఆర్థికంగా వెనుకబడ్డారని.. వారిని బీసీ ఈ కేటగిరీలో చేర్చాలని కోరారు.

50 శాతం తగ్గకుండా రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సమాజ్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ సాగర్‌ కోరారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సమగ్ర కులగణన చేయడానికి ప్రభుత్వం ముందుకు రావడాన్ని బీసీ సమాజం అభినందిస్తుందన్నారు.

దక్కన్‌ జాతి గొర్రెలను కాపాడాలని గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోపాల్‌ కోరారు. గొర్రెల పరిశోధనా కేంద్రానికి 200 ఎకరాల భూమి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

కోటి 20 లక్షల జనాభా ఉన్న ముదిరాజ్‌లకు రాజకీయ ప్రాధాన్యతలో వాటా దక్కక పోవడంతో వెనుకబడి ఉన్నారని తెలంగాణ మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు, నాయకుడు మైత్రి యాదయ్య అన్నారు. విద్య, సామాజిక, ఆర్థికంగా వెనుకబడి ఉన్నామని.. తమకు రిజర్వేషన్లు కల్పిస్తే అభివృద్ధి సాధిస్తామన్నారు.

నీలి కుల కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని ఆ సంఘం నాయకులు కోరారు.

బీసీ డిక్లరేషన్‌ను అమలుపర్చాలని బీసీ సేనా జిల్లా అధ్యక్షుడు కృష్ణయాదవ్‌ కోరారు. బీసీల అభ్యున్నతికి ప్రతి ఏటా రూ. 20వేల కోట్లు కేటాయించాలన్నారు.

రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని రజక సంఘం జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం కోరారు.

దొంగ సర్టిఫికెట్ల కేటాయింపులను అరికట్టాలని బెస్తా సంఘం నాయకుడు అంజయ్య కోరారు. దొంగ సర్టిఫికెట్లతో బెస్త కులం విద్యార్థులు నష్టపోతున్నారన్నారు.

జనాభా దామాషా ప్రకారం ప్రాధాన్యం ఇవ్వాలి

వివిధ సంఘాల డిమాండ్‌.. కమిషన్‌కు వినతుల వెల్లువ

బీసీల సామాజిక, ఆర్థిక, విద్యపరమైన స్థితిగతులపై బహిరంగ విచారణ

అర్జీలను స్వీకరించిన బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌

ఉమ్మడి జిల్లా నుంచి 135 వినతులు

బీసీ కమిషన్‌ ఏర్పాటు హర్షణీయం..

జోగుళాంబ గద్వాల జిల్లాలోని బీసీ వర్గాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం బీసీ కమిషన్‌ ఏర్పాటు చేయడం హర్షణీయమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. గద్వాలలో ముదిరాజ్‌లు, బోయల జనాభా అత్యధికంగా ఉందన్నారు. బీసీ–డీలో ఉన్న ముదిరాజ్‌లను బీసీ–ఏ లోకి మార్చడంతో పాటు బోయలను ఎస్సీ జాబితాలో చేర్చాలన్నారు. కమిషన్‌ ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయని నమ్ముతున్నట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
బీసీ రిజర్వేషన్లు పెంచాల్సిందే..1
1/3

బీసీ రిజర్వేషన్లు పెంచాల్సిందే..

బీసీ రిజర్వేషన్లు పెంచాల్సిందే..2
2/3

బీసీ రిజర్వేషన్లు పెంచాల్సిందే..

బీసీ రిజర్వేషన్లు పెంచాల్సిందే..3
3/3

బీసీ రిజర్వేషన్లు పెంచాల్సిందే..

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement