భోజనం.. నాసిరకం!
పాఠశాలల్లో మెనూ పాటించని అధికారులు
● బియ్యం నాసిరకంగా ఉన్నాయంటున్న వంట కార్మికులు
● పోషక బియ్యమంటూ పంపిణీ.. మెత్తబడుతున్న అన్నం
● చాలా పాఠశాలల్లో
వంట గదులు, స్వచ్ఛత కరువు
●
మెనూ పాటించడం లేదు..
మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించడం లేదు. వండిన కూరగాయలు నాసిరకంగా ఉండటంతో తినలేకపోతున్నాం. ఒక్కోసారి మిరపపొడి వేసుకుని తినాల్సి వస్తోంది. వెజిటేబుల్ బిర్యాని అంటారేగాని అందులో కూరగాయలు కనిపించవు.
– అనూష, 10వ తరగతి, అమరచింత
అమరచింత: నారాయణపేట జిల్లా మాగనూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులు అస్వస్థకు గురై ఆస్పత్రి పాలైన విషయం పాఠకులకు విధితమే. దీంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం నిర్వహణ ఎలా ఉందన్న అంశంపై శుక్రవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పరిశీలన జరిగింది. పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి భోజనం అందుతుంది.. పరిసరాలు ఎలా ఉన్నాయనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానోపాధ్యాయులను అడుగగా మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నామని చెప్పడం కనిపించింది. వారంలో మూడురోజులు గుడ్డు అందించాల్సి ఉండగా.. కేవలం రెండ్రోజులు మాత్రమే ఇస్తున్నారని విద్యార్థులు తెలిపారు. మధ్యాహ్న భోజనం అమలుకు ప్రభుత్వం జారీ చేసిన మెనూ సైతం పాటించడం లేదని తెలిసింది. కొందరు విద్యార్థులు భోజనానికి ఇంటికి వెళ్లడం కనిపించింది. భోజనానికి ఇంటికే వెళ్తామని.. మొదటి నుంచి అలవాటు లేదని చెప్పారు.
ప్రభుత్వం సరఫరా చేస్తున్న సన్నరకం బియ్యం నాసిరకంగా ఉన్నాయని.. వండటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వంట ఏజెన్సీ మహిళలు చెబుతున్నారు. పోషకాలు కలిపిన బియ్యమంటూ సరఫరా చేస్తున్నారని.. వాటిని వండే సరికి అన్నం మెత్తబడుతుండటంతో విద్యార్థులు తినడానికి ఆసక్తి చూపడం లేదని వివరించారు. 50 కిలోల బియ్యం బస్తాలో సుమారు 43 కిలోలు మాత్రమే ఉంటున్నాయని.. తక్కువగా సరఫరా అయిన బియ్యం భారం తమపై పడుతుందని, వీటి లెక్కలు చెప్పాలంటూ ప్రధానోపాధ్యాయులు అడగటంతో ఏం చెప్పాలో తోచని పరిస్థితి ఉందన్నారు.
ప్రభుత్వ పాఠశాలలు 518
గ్రామాలు255
మధ్యాహ్న భోజనానికి హాజరయ్యే వారు సుమారు 35 వేలు
విద్యార్థుల సంఖ్య
సుమారు 43 వేలు
నాసిరకం బియ్యం.. తూకంలో తేడాలు...
జిల్లాలో ఇలా..
నా పేరు హరిత. మండలంలోని కొంకన్వానిపల్లి స్వగ్రామం. అమరచింత ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్నా. పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగానే ఉంటోంది.. కాని వారంలో మూడురోజులు గుడ్డు ఇవ్వాల్సి ఉండగా.. రెండు పర్యాయలే అందిస్తున్నారు. ఇదేమని అడిగితే బిల్లులు రావడం లేదని నిర్వాహకులు బదులిస్తున్నారు.
పరిశీలనలో వెలుగుచూసిన అంశాలు..
అమరచింత డీఎంఆర్‌ఎం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో భోజనశాల పరిసరాల్లో మిగిలిన అన్నం, కూరగాయలు పారబోయడంతో పరిసరాలు అపరిశుభ్రంగా తయారయ్యాయి.
కొత్తకోట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఇన్‌చార్జ్ హెచ్‌ఎం దగ్గరుండి భోజనాలు వడ్డించడం కనిపించింది.
పాన్‌గల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వంటగది చిన్నగా ఉండటం, భోజనశాల లేకపోవడంతో విద్యార్థులు పాఠశాల ఆవరణలో భోజనం చేయడం కనిపించింది. మధ్యాహ్న భోజన సమయంలో కోతులు, పందులు, కుక్కలు ఆవరణలో సంచరించడం కనిపించింది.
ఆత్మకూర్ బాలుర ఉన్నత పాఠశాలలో వంటగది లేక ఆవరణలో వండుతున్నారు. పొగతో నిర్వాహకులు, విద్యార్థులు ఇబ్బందులు పడటం కనిపించింది.
చిన్నంబావి, గోపాల్‌పేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగుందని విద్యార్థులు తెలిపారు.
బిల్లులు రావడం లేదు..
ఆరు నెలలుగా మధ్యాహ్న భోజన బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్నాం. పాఠశాలలో ఐదుగురం కలిసి భోజనం తయారు చేస్తున్నాం. కిరాణా దుకాణంలో డబ్బులు చెల్లించకపోగా.. సరుకుల కొనుగోలుకు బయట రూ.70 వేల వరకు అప్పు చేశాం.
– పద్మమ్మ,
వంట కార్మికురాలు, గోపాల్‌పేట
మెనూ ప్రకారమే భోజనం..
ప్రభుత్వ మెనూ ప్రకారమే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలి. నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేసేలా చూస్తాం. బియ్యం బాగోలేకపోతే వెంటనే ఎంఈఓల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలి. పాఠశాల ఆవరణ, మధ్యాహ్న భోజనం తయారు చేసే ప్రదేశాలు పరిశుభ్రంగా లేకపోతే ప్రధానోపాధ్యాయులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎంఈఓలు నిత్యం ఏదో ఒక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించాలని ఆదేశించాం.
– గోవిందరాజులు, ఇన్‌చార్జ్ డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment