నాణ్యమైన ఆహారం అందించాలి
వనపర్తి: జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో విద్య, సంక్షేమశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, వెంకటేశ్వర్లుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలుచోట్ల కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు వస్తున్న వార్తల దృష్ట్యా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఇలాంటి ఘటనలకు ఆస్కారం ఇవ్వొద్దని.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వసతిగృహాలు, విద్యాలయాల్లో సరుకుల స్టాక్ రిజిస్టర్, రోజువారీ వినియోగం వివరాలు కచ్చితంగా నమోదు చేయించాలన్నారు. ప్రతి పాఠశాలలో ఫుడ్ సూపర్‌వైజర్లను నియమించాలని.. విద్యార్థులతో మెస్ కమిటీ ఏర్పాటు చేసి ఆహార పదార్థాల పరిశీలన బాధ్యతలు అప్పగించాలని సూచించారు. కిరాణం, ఇతర సరుకులు వచ్చిప్పుడు ఫుడ్ సూపర్‌వైజర్లతో పాటు మెస్ కమిటీ సభ్యుల సంతకాలు తీసుకోవాలన్నారు. స్వచ్ఛమైన తాగునీరు అందించేలా, వంటకు వినియోగించే కూరగాయలు, ఇతర సామగ్రిని నీటితో శుభ్రం చేసేలా చూడాలన్నారు. ఫుడ్ సూపర్‌వైజర్ తిన్న తర్వాతే విద్యార్థులకు ఆహారం వడ్డించాలని ఆదేశించారు. వంట ఏజెన్సీ కార్మికులు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకున్న తర్వాతే వంట ప్రారంభించాలని, విద్యార్థులు తినే ముందు చేతులు, ప్లేటు శుభ్రంగా కడుక్కునేలా జాగ్రత్తలు తీసుకోవాలని.. సబ్బు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఎక్కడైనా ఆహారం బాగోలేదని తెలిస్తే సంబంధిత ఫుడ్ సూపర్‌వైజర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
విద్యార్థినులతో కలిసి భోజనం..
స్థానిక కేజీబీవీని శుక్రవారం సాయంత్రం కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తనిఖీ చేశారు. విద్యార్థినులతో కలిసి పాఠశాలలోనే భోజనం చేశారు. రోజువారీ మెనూ, రోజు వంటకాలు ఇలాగే ఉంటాయా.. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, బోధన ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వంటకు ఏ నీరు వాడుతున్నారు.. స్టాక్ రిజిస్టర్, పిల్లలు చేతులు, ప్లేట్లు కడుక్కునేందుకు సబ్బులు ఉంచారా లేదా అనే విషయాలను పరిశీలించారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి
Comments
Please login to add a commentAdd a comment