డ్రంకెన్ డ్రైవ్‌తోనే ప్రమాదాలు
కొత్తకోట: మద్యం తాగి వాహనాలు నడపడంతోనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. గురువారం కొత్తకోట పోలీస్‌స్టేషన్‌లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిసిట్యూట్‌ను ప్రారంభించారు. అనంతరం డ్రైవర్లు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలకు అనేక కారణాలు ఉంటాయని, అందులో మద్యం తాగి వాహనాలు నడపడం.. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన లేకపోవడం లాంటివి ప్రధాన కారణాలని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా రోడ్డు నిబంధనలపై అవగాహన కలిగి ఉండటంతో పాటు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మద్యం తాగి ఎట్టి పరిస్థితుల్లో వాహనం నడపరాదన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని.. తద్వారా సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. అనంతరం సీపీఆర్ విధానంపై వైద్యులు అవగాహన కల్పించారు. డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను అందజేశారు. కార్యక్రమంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇంటరైస్ కంపెనీ ప్రాజెక్టు మేనేజర్ దీపమాదియా, సీఐ రాంబాబు, ఎస్‌ఐలు మంజునాథ్‌రెడ్డి, హరిప్రసాద్ రెడ్డి, యుగంధర్ రెడ్డి, రామకృష్ణ, నేషనల్ హైవే అథారిటీ ఆపరేషన్ మేనేజర్ సంతోష్ కుమార్, రూట్ ఆఫీసర్ తేజ రూప్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
వాహనదారులు విధిగా రోడ్డు నిబంధనలు పాటించాలి
ఎస్పీ రావుల గిరిధర్
Comments
Please login to add a commentAdd a comment