అట్టహాసంగా ఆర్‌ఎల్‌డీసీ స్వర్ణోత్సవాలు
వనపర్తి టౌన్/వనపర్తి విద్యావిభాగం: జిల్లాకేంద్రంలోని రాణి లక్ష్మీదేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఆర్‌ఎల్‌డీసీ) స్వర్ణోత్సవాలను ఆదివారం జిల్లాకేంద్రంలో పూర్వ విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పూర్వ విద్యార్థులు తెలంగాణ ఎలక్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ జస్టిస్ డి.నాగార్జున, ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, పూర్వపు ఆర్జేడీ రాజేందర్‌సింగ్, గద్వాల అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ తదితరులతో పాటు రాష్ట్రంలోని నలుమూలల నుంచి కళాశాలలో చదువుకున్న విద్యార్థులు హాజరయ్యారు. కుటుంబ స్థితిగతులు, మంచి చెడులను ఒకరికొకరు పంచుకుంటూ సెల్ఫీలు తీసుకోవడం కనిపించింది. పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన స్వర్ణోత్సవ సంబురం అందరిలో ఆనందోత్సవాలను నింపింది. అధ్యాపకులు, కార్యక్రమానికి హాజరైన పూర్వ విద్యార్థులను, అతిథులను స్వర్ణోత్సవ కమిటీ ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.
విలువల విద్యకు చిరునామా..
సమకాలిన అంశాలను పాఠ్యాంశాలకు అనుసంధానం చేసి విద్యార్థులకు బోధించడం వనపర్తి ప్రాంత ప్రత్యేకతని తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ జస్టిస్ డి.నాగార్జున, ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, పూర్వపు ఆర్జేడీ రాజేందర్‌సింగ్ అన్నారు. విలువలతో కూడిన విద్యను అందించడంతోనే జీవితంలో ఉన్నతస్థాయిలో ఉండగలిగామని, హోదా ఎంత పెరిగినా ఇక్కడ వేసిన పునాదే బలమైన కారణమని పేర్కొన్నారు. దేశ విదేశాల్లో ఎక్కడ చదివినా ఇక్కడి విద్యకు సరిసమానంగా అనిపించలేదని తెలిపారు.
భవిష్యత్ తరాలకు స్ఫూర్తి..
కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ ఆదర్శ్ సురభి పేర్కొన్నారు. చదివిన కళాశాలపై మక్కువతో అభివృద్ధికి పాటుపడేందుకు చొరవచూపడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడారు.
అభివృద్ధికి విభేదాలు ఉండవు..
పార్టీ సిద్ధాంతాల పరంగా విభేదాలున్నా.. వనపర్తి అభివృద్ధి విషయంలో తమకు ఎప్పుడు విభేదాలు ఉండవని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డి, మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి ప్రకటించడంతో సభలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. వనపర్తిని విద్యపరంగా ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం తపిస్తుంటానని, గత ప్రభుత్వంలో మిగిలిన పనులంటిని పూర్తి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చిన్నారెడ్డి వెల్లడించారు. తన హయాంలో విద్యారంగానికి చేసిన సేవలను గుర్తు చేశారు. మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్ తరాల కోసం విద్యలో వనపర్తిని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేశానన్నారు. కీర్తి కోసం కాకుండా శాశ్వత అభివృద్ధికి బాటలు వేశానని వివరించారు. ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. వనపర్తిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
హాజరైన ప్రముఖులు, అధికారులు, ప్రజాప్రతినిధులు
వనపర్తి అనుబంధం మరువలేనిది..
1979 నుంచి 1982 వరకు ఈ కళాశాలలో చదువుకున్నాను. విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించి అధ్యాపకులు బోధించిన తీరుతోనే ఉన్నతంగా ఎదిగాం. తాను డాక్టరేట్ పొందినా, అమెరికాలో విద్యనభ్యసించినా ఇక్కడి ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్యలో ఉండే అనుంబంధం ఎక్కడ కనిపించలేదు. ఇక్కడ విద్యను అభ్యసించడం ఎనలేని అనుబంధాన్ని మిగిల్చింది.
– జస్జిస్ నాగార్జున, చైర్మన్
తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్
విద్యాపర్తిగా గుర్తింపు..
విద్యాపరంగా వనపర్తికి పూర్వం నుంచే మంచి గుర్తింపు ఉంది. నాటి ఉపాధ్యాయులు ఆ గుర్తింపునకు అనుగుణంగా మమ్మల్ని తీర్చిదిద్దడంతో జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించగలిగాం. విలువలు, క్రమశిక్షణతో బోధన అందించారు. ఇక్కడి ఉపాధ్యాయులు స్ఫూర్తివంతంగా, ఆదర్శప్రాయులుగా నిలిచారు. వనపర్తిలో పడిన పునాదులతోనే జీవితంలో ఉన్నతంగా ఎదిగాం.
– లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్, గద్వాల
ఆనందంగా ఉంది..
కళాశాల స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకోవడం ఆనందంగా ఉంది. ఆడపిల్లలకు ఉన్నత విద్య అందించేందుకు అప్పట్లో చిన్నారెడ్డి విశేషంగా కృషి చేశారు. మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడంతో ఎందరో అమ్మాయిలు ఉన్నత విద్యను అభ్యసించేందుకు 30 ఏళ్ల కిందట వనపర్తిలో అడుగులు పడ్డాయి. పాలమూరులో మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడంతో మహిళల అక్ష్యరాస్యత పెంచేందుకు దోహదపడుతుంది. ఇక్కడ చదువుకొని రచయితలుగా, కవయిత్రులుగా, కళాకారులుగా రాణించడం ఈ ప్రాంతం కల్పించిన గొప్ప అవకాశం.
– యశోద, సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment