ఇదేం చోద్యం..!
●
బకాయిలు చెల్లించాలంటూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నోటీసులు
ఇందిరమ్మ పేరిట
ఉచితం అన్నారు..
అప్పట్లో నాకు యుక్త వయస్సు. కుటుంబం చిన్నదిగా ఉందని ఇంటికోసం దరఖాస్తు చేసుకున్నా. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి పేదలకు అందిస్తుండటంతో తమకూ ఉచితంగా ఇంటిని మంజూరు చేసిందని అనుకున్నాం. కానీ ఇప్పుడు రూ.2.39 లక్షలు చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం దయ తలచి తమకు న్యాయం చేయాలి.
– దాసు, లబ్ధిదారు, ఎస్సీకాలనీ
కూలేందుకు సిద్ధంగా ఉంది..
42 ఏళ్ల కిందట ఇందిరమ్మ పేరిట ఇల్లు ఇచ్చారు. ప్రస్తుతం ఆ ఇల్లు పెచ్చులూడుతోంది. బీడీలు తయారు చేసుకుంటూ అప్పుడప్పుడు మరమ్మతులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. ఇప్పుడు అప్పు కట్టమంటే ఎలా చెల్లించేది. పని దినాలు లేక కుటుంబ పోషణ భారమవుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వమే ఆదుకోవాలి.
– మల్లమ్మ, లబ్ధిదారు, అమరచింత
అప్పుగా అని చెప్పలేదు..
అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇళ్లు ఇచ్చిందనుకున్నాం. కానీ ఇన్నేళ్ల తర్వాత మీ ఇంటిపై అప్పు ఉందని.. చెల్లించాలంటూ అధికారులు నోటీసులు ఇస్తున్నారు. అసలే పేదలం.. ఇందిరమ్మకాలనీ పేరిట నిర్మించిన హౌసింగ్‌బోర్డు కాలనీపై దయ చూపాలి.
– భాగ్యమ్మ, లబ్ధిదారు, అమరచింత
ప్రభుత్వమే ఆదుకోవాలి..
అప్పుడేప్పుడో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లపై ఉన్న బకాయిలను ప్రస్తుత ప్రభుత్వం చెల్లించి ఆదుకోవాలి. 125 ఇళ్లలో నివసిస్తున్న ప్రతిఒక్కరూ బీడీల తయారీపై ఆధారపడి జీవిస్తున్నారు. నెలకు కేవలం 15 రోజుల పనిదినాలు ఉండటం.. చాలీచాలని వేతనాలతో పూట గడవని పరిస్థితుల్లో ఉన్నారు. పెచ్చులూడుతున్న ఇళ్లకు మరమ్మతులు చేసుకునేందుకు అప్పు చేస్తున్న పరిస్థితులు వారివి.
– బుచ్చన్న, జిల్లా అధ్యక్షుడు,
బీడీ కార్మిక సంఘం, అమరచింత
అమరచింత: 1982లో అప్పటి ప్రభుత్వం ఇళ్లు లేని దళితుల కోసం అమరచింతలో ఇందిరమ్మకాలనీ పేరిట 9 ఎకరాల స్థలం కొనుగోలు చేసి 125 పేదలకు ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు అందించింది. ఇచ్చిన ఇళ్లకు అప్పట్లో మార్టిగేజ్ చేయడంతో మిగిలిన మొత్తాన్ని చెల్లించాలంటూ రాష్ట్ర హౌసింగ్‌బోర్డు అధికారులు చివరి నోటీసులు అందజేస్తుండటంతో పేద బీడీ కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గతంతో తాము డబ్బులు చెల్లించలేమంటూ పలుమార్లు పాలకులు, అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని.. తమకు న్యాయం చేయాలంటూ లబ్ధిదారులు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి విన్నవించుకుంటున్నారు. రెక్కాడితే డొక్కాడని పరిస్థితుల్లో కుటుంబాలను నెట్టుకొస్తున్నామని.. కాంగ్రెస్ ప్రభుత్వం తమకు భరోసానిచ్చి తమ ఇళ్లపై ఉన్న అప్పును పూర్తిగా మాఫీచేసి కుటుంబాలకు రక్షణ కల్పించాలని వేడుకోంటున్నారు.
వివరాల్లోకి వెళ్తే..
1982లో అప్పటి ఎమ్మెల్యే వీరారెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కేవలం అమరచింతలో స్టేట్ హౌజింగ్‌బోర్డుతో పాటు కేంద్ర ప్రభుత్వ సాయంతో పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు నిర్ణయించారు. పట్టణంలోని మెటంబాయికి చెందిన 9 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి 125 ఇళ్లు నిర్మించి ఇందిరమ్మకాలనీ పేరుగా నామకరణం చేసి అప్పటి కేంద్ర మంత్రి మల్లికార్జున్, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి చిత్తరంజన్‌దాస్ చేతుల మీదుగా ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. వీరితో పాటు మాలలకు 25 ప్లాట్లను సైతం ఇచ్చారు. హైర్ పర్చేజ్ విధానంలో నిర్మించిన ఇళ్లను హౌసింగ్‌బోర్డు మార్టిగేజ్ చేసుకోవడంతో ఏడాదికి రూ.1,832 చెల్లించాలని ఒప్పందం కుదుర్చుకొని ఇళ్లను అప్పగించామని అధికారులు అంటున్నారు. ప్రభుత్వమే ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇచ్చిందని.. తమకు కంతులు చెల్లించాలనే నిబంధన అప్పట్లో చెప్పలేదని లబ్ధిదారులు చెబుతున్నారు. 42 ఏళ్లకుగాను ఒక్కొక్కరు రూ.2,39,429 చెల్లించాలని ఫైనల్ నోటీసులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 1982లో నిర్మించిన ఇళ్లను 1985లో గ్రౌండింగ్ చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం అప్పగించింది.
ఒక్కో ఇంటికి రూ.16,600..
అప్పట్లో ప్రతి ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.16,600, కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.1,500 రాష్ట్ర హౌసింగ్‌బోర్డుకు చెల్లించారు. అవిపోను మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారు ఏడాది రూ.1,832 చొప్పున 20 ఏళ్లు చెల్లించాల్సి ఉంది. కానీ కుటుంబ పోషణతో తల్లడిల్లుతున్న బీడీ కార్మికులు వాటిని చెల్లించలేకపోయారు. బకాయిలు పేరుకుపోవడంతో అధికారులు చివరి నోటీసులు అందిస్తుండటంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు.
అమరచింత హౌసింగ్‌బోర్డుకాలనీలో ఇందిరమ్మ ఇల్లు
అమరచింతలో 1982లో ఇళ్లు మంజూరు
125 మంది దళితులకు పంపిణీ
నెలాఖరు గడువుతో చివరి నోటీసు అందిస్తున్న అధికారులు
ఆందోళనలో పేద దళిత బీడీ కార్మికులు
Comments
Please login to add a commentAdd a comment