‘విద్యుత్’ ప్రైవేటీకరణ సరికాదు
వనపర్తి రూరల్: విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను రద్దు చేస్తూ సంస్థలో పనిచేస్తున్న ఆర్జీజన్ కార్మికులకు కన్వర్షన్ ఇవ్వాలని టీజీయూఈఈయూ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కుమారస్వామి కోరారు. ఆదివారం తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (టీజీయూఈఈయూ), టీజీఎస్‌పీడీసీఎల్ అధ్యక్షుడు చంద్రారెడ్డి అధ్యక్షతన జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ హాల్‌లో జరిగిన మహాసభలకు ఆయనతో పాటు సంఘం అధ్యక్షుడు ఈశ్వరరావు, ప్రధానకార్యదర్శి గోవర్ధన్ ముఖ్యఅతిథులుగా హాజరై కార్యాలయం ఎదుట సంఘం జెండా ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. 1999 తర్వాత నియమితులైన విద్యుత్ ఉద్యోగులందరికి పాత పింఛన్ విధానం అమలు చేయాలన్నారు. ఉద్యోగులందరికీ అన్ లిమిటెడ్ మెడికల్ క్రెడిట్ కార్డు ఇవ్వాలని కోరారు. మహాసభల్లో పలు తీర్మానాలు చేశారు. అనంతరం టీజీఎస్‌పీడీసీఎల్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బస్వరాజు, సుధాకర్, ప్రసాద్, రాజు, సాంబయ్య, సురేశ్‌గౌడ్, రవీంద్రప్రసాద్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ
రేషన్‌కార్డులు ఇవ్వాలి
వనపర్తిరూరల్: ప్రజాపాలనలో దరఖాస్తుల చేసుకున్న అర్హులందరికీ రేషన్‌కార్డులు ఇవ్వాలని భారత జాతీయ మహిళ సమాఖ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణవేణి, గీత ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు కళావతమ్మ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఐద్వా కార్యాలయంలో భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. రేషన్‌కార్డులపై సంక్రాంతికి సన్నబియ్యం ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని, ముందుగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. లేకపోతే సన్న బియ్యం ఇచ్చినా కొద్దిమందికే ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఇప్పటికే కార్డులు కలిగిన వారి కుటుంబాల్లో పిల్లలు పెద్దవారయ్యారని, వారి పేర్లను కార్డుల్లో చేర్చాలని ఎన్నో ఏళ్లుగా అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు ఇచ్చిన హామీ ప్రకారం రూ.2,500 ఇవ్వాలని, మహిళా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలన్నారు. మహిళలు సంఘటితంగా గ్రామ కమిటీలను నిర్మించుకోవాలని సూచించారు. సమావేశంలో సంఘం పట్టణ కన్వీనర్ జయమ్మ, కోకన్వీనర్లు భూమిక, శిరీష, శ్రీదేవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment