‘మేఘా’ మార్క్ అభివృద్ధి చూపిస్తా : ఎమ్మెల్యే
వనపర్తి: నియోజకవర్గ అభివృద్ధికి తాను పెద్ద జీతగాడిలా అహర్నిశలు పనిచేసి మేఘా మార్కు చూపిస్తానని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 473 మంది లబ్ధిదారులకు రూ.1,12,47,500 విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 215 మందికి రూ.2,15,24,940 విలువగల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని.. కొద్దిరోజుల్లోనే వ్యవసాయ యోగ్యమైన సాగుభూమి ఎకరాకు రూ.ఆరు వేలు, భూమి లేని పేదలకు సైతం ఏటా రూ.12 వేలు అందజేయనున్నామన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే రూ.673 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని.. జిల్లాకేంద్రంలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మిస్తామన్నారు. గత ప్రభుత్వ పాలనలో క్యాంపు కార్యాలయంలోకి ఎవరిని అనుమతించేవారు కాదని.. నేడు పండుగ వాతావరణం నెలకొనడం సంతోషంగా ఉందని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని, ఇతర వారికి అవకాశమిస్తే అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని సూచించారు. దీనిని దృష్టిలో ఉంచుకొని పార్టీ కార్యకర్తలు, నాయకులు అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో పట్టణ, వివిధ మండలాల కాంగ్రెస్పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment