‘డబుల్’ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి
కొత్తకోట రూరల్: జిల్లాలో వివిధ స్థాయిల్లో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కాంట్రాక్టర్లను ఆదేశించారు. మంగళవారం కొత్తకోట మండలం పామాపురం, పెబ్బేరు మండలం పాతపల్లెలో గత ప్రభుత్వ హయంలో మంజూరై అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను ఆయన పరిశీలించారు. పామాపురం గ్రామంలో నాలుగేళ్ల కిందట 56 ఇళ్లు మంజూరు కాగా అవి పూర్తయి లబ్ధిదారులకు కేటాయించారు. మరికొందరి కోసం గ్రామస్తులు పట్టుబట్టి ఎన్నికల సమయంలో మరో 25 ఇళ్లు మంజూరు చేయించుకున్నారు. వాటిలో కొన్ని చెత్తు, మరికొన్ని బేస్‌మెంట్, ఇంకొన్ని చివరి దశల్లో ఉన్నాయని పంచాయతీరాజ్ కార్యనిర్వాహక ఇంజినీర్ మల్లయ్య కలెక్టర్‌కు వివరించారు. అదేవిధంగా పెబ్బేరు మండలం పాతపల్లిలో 50 ఇళ్లు మంజూరు కాగా అవన్నీ చెత్తు దశ వరకు పూర్తికాగా.. గోడలు కట్టడం, ప్లాస్టరింగ్ తదితర పనులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి ఎంబీ తయారుచేసి ఇవ్వాలని ఆదేశించారు. బిల్లులు చెల్లిస్తామని.. నాణ్యతగా నిర్మించి ఉగాదిలోగా అందించాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. కలెక్టర్ వెంట పెబ్బేరు తహసీల్దార్ లక్ష్మి, ఎంపీఓ రోజా, కాంట్రాక్టర్ షణ్ముఖి తదితరులు ఉన్నారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి
Comments
Please login to add a commentAdd a comment