పనుల్లో నాణ్యత పాటించాలి
వనపర్తి రూరల్: భవన నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అధికారులను ఆదేశించారు. వనపర్తి మండలం రాజపేట శివారులో రూ.ఐదు కోట్లతో చేపడుతున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) భవన నిర్మాణ పనులను బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలన్నారు. అనంతరం ఉన్న ఐటీఐ కళాశాలలో విద్యార్థులతో మాట్లాడి వసతులపై ఆరా తీశారు. బాగా చదువుకొని భవిష్యత్‌లో ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
26 నుంచి పథకాల అమలు..
గోపాల్‌పేట: నిజమైన అర్హులు చింతించాల్సిన అవసరం లేదని.. అధికారులే ఇంటివద్దకు వచ్చి పథకాలు వర్తింపజేస్తారని రాష్ట్ర ప్రణాళి కా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నా రు. బుధవారం ఆయన కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి మండలంలోని తాడిపర్తి, తిర్మలాపూర్‌లో జరిగిన గ్రామసభల్లో పాల్గొని జాబితాలో పేర్లు లేని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇందిరమ్మ కమిటీలు నిజమైన అర్హులను మాత్రమే గుర్తించి వారికి అండగా ఉంటా రని తెలిపారు. తహసీల్దార్ తిలక్‌కుమార్‌రెడ్డి, ఆయా గ్రామాల అధికారులు పాల్గొన్నారు.
మోసపూరిత
ప్రకటనలు నమ్మొద్దు
వనపర్తి: మోసపూరిత వాగ్దానాలు, ప్రకటనల మల్టీ లేవల్ మార్కెటింగ్ పథకాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల సొమ్మును దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలను అనుసరిస్తున్నారని.. చైన్ సిస్టం మార్కెటింగ్‌తో ఆర్థికపరమైన మోసాలు జరుగుతున్నాయనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. నిత్యావసర సరుకులు, గృహోపకరణాలు, వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు, క్రిప్టో కరెన్సీ తదితర వాటి పేర్లు చెప్పి ప్రజలను ఆర్థిక మోసాలకు గురిచేస్తున్నారని వివరించారు. మల్టీ లేవల్ మార్కెటింగ్‌తో డబ్బులు సేకరించిన ఫిర్యాదులపై జిల్లాలో రెండు కేసులు నమోదు చేశామని తెలిపారు. ఎక్కువమంది ఏజెంట్లను చేర్పిస్తే రివార్డులు, పాయింట్లు వస్తాయంటూ కేటుగాళ్ల మాయ మాటలు నమ్మి అత్యాశకు పోతే ఆర్థిక నష్టం జరుగుతుందన్నారు. అతి తక్కువ కాలంలో అధిక లాభాలు వస్తాయని ఎవరైనా చెబితే అది మోసమని గ్రహించాలని సూచించారు. సైబర్ నేరగాళ్ల బారిన పడితే వెంటనే హెల్ప్‌లైన్ నంబర్ 1930, వాట్సాప్ నంబర్ 87126 72222 ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఎలాంటి ఆంక్షలు లేకుండా క్రమబద్ధీకరించాలి
వనపర్తి రూరల్: విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను ఎలాంటి ఆంక్షలు లేకుండా క్రమబద్ధీకరించాలని టీవీఏసీ జేఏసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సింగిరెడ్డి చంద్రారెడ్డి డిమాండ్ చేశారు. టీవీఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం జిల్లాకేంద్రంలోని సర్కిల్ కార్యాలయం ఎదుట టీవీఏసీ జేఏసీ నాయకులు చేస్తున్న దీక్షలు బుధవారం మూడోరోజుకు చేరాయి. చంద్రారెడ్డి దీక్షలో పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపి మాట్లాడారు. సంస్థల్లో శాశ్వత ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న ఆర్టిజన్స్‌ని వెంటనే కన్వర్షన్ చేయాలని కోరారు. గత ప్రభుత్వం క్రమబద్ధీకరించామని చెప్పి చేయకుండా మోసం చేసిందని ఆరోపించారు. ఆనంద్‌గౌడ్, హెచ్ 82 యూనియన్ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, కార్యదర్శి చందు, బాలు, రామకృష్ణ పాల్గొన్నారు.
రామన్‌పాడులో 1,021 అడుగుల నీటి మట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడులో బుధవారం నాటికి పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులకు చేరింది. జూరాల ఎడమ కాల్వ ద్వారా 640 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. సమాంతర కాల్వ ద్వారా వచ్చే నీటిని నిలిపివేశారు. ఎన్టీఆర్ కాల్వ ద్వారా 800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ కాల్వల ద్వారా తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment