భయం వీడితే విజయం మీదే..
వనపర్తి: విద్యార్థి దశలో పదోతరగతి అత్యంత కీలకమని.. మంచి మార్కులు సాధిస్తే ఉన్నత స్థానంలో స్థిరపడవచ్చని, భయం వీడితే విజయం మీదేనని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులకు నిర్వహించిన ప్రేరణ తరగతులకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి విద్యార్థి నిరంతరం సాధన చేయడంతో సబ్జెక్టుపై పట్టు సాధించి పరీక్షలంటే భయం ఉండదన్నారు. మార్చిలో పరీక్షలున్నాయని నిర్లక్ష్యం చేయకుండా నిరంతరం సాధన చేయాలని సూచించారు. జీవితంలో ఏది జరిగినా కుంగిపోవద్దని.. నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వసతిగృహ విద్యార్థులకు మెస్, కాస్మొస్టిక్ ఛార్జీలు భారీగా పెంచిందని.. సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువులు చదవాలని కోరారు అనంతరం నిష్ణాతులైన ఉపాధ్యాయులతో సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ, గిరిజన అభివృద్ధి అధికారి బీరం సుబ్బారెడ్డి, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి మల్లికార్జున్, వసతిగృహ సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థి దశ నుంచే కోడింగ్ పాఠాలు
గోపాల్‌పేట: విద్యార్థి దశ నుంచే కోడింగ్, చాట్ జీపీటీ, కంప్యూటర్ స్కిల్స్ మెరుగుపర్చుకోవడంతో భవిష్యత్‌లో ఉన్నతస్థాయికి చేరుకొనే అవకాశాలు మెండుగా ఉంటాయని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని కేజీబీవీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో కొత్తగా ప్రారంభించిన కోడింగ్ పాఠాలు ఎలా బోధిస్తున్నారు.. ఏమేం బోధిస్తున్నారు.. ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నారనే వివరాలపై ఆరా తీశారు. కోడింగ్, చాట్ జీపీటీపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం రికార్డులు, వసతులను పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆయన వెంట జీసీఈఓ శుభలక్ష్మి, తహసీల్దార్ తిలక్‌కుమార్‌రెడ్డి, కేజీబీవీ ప్రిన్సిపల్ దీప్తి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment