రెచ్చగొట్టే సందేశాలు పంపితే చర్యలు : ఎస్పీ
వనపర్తి: సామాజిక మాధ్యమాల్లో విధ్వేషాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దుష్ప్రచారం, ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ రావుల గిరిధర్ హెచ్చరించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో ఏం చేసినా తమకేం కాదన్న ధీమాతో అసభ్య పదజాలంతో విధ్వేషపూరిత పోస్టులను ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టా, వాట్సప్‌లో ఇతరులకు ఇబ్బంది కలిగేలా పెడుతున్నారని.. అసత్యాలను వ్యాప్తి చేసే వారితో పాటు గ్రూపు అడ్మిన్‌ను బాధ్యుడిగా చేస్తూ కేసులు నమోదు చేయడంతో పాటు వేగంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్‌శాఖలో ప్రస్తుతం ఉన్న సాంకేతికతతో ప్రత్యేక నిఘా వ్యవస్థ ఉంటుందని.. వారిని పట్టుకోవడం చాలా తేలికని వివరించారు. జిల్లాలో ఈ తరహా కార్యకలాపాలు చేసే వారిని అనుక్షణం పోలీసులు గమనిస్తూనే ఉంటారన్నారు. ఎవరైనా ఇబ్బందులకు గురైతే నేరుగా పోలీస్‌స్టేషన్, జిల్లా పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించారు.
వనపర్తి పుర కమిషనర్‌గా వెంకటేశ్వర్లు
వనపర్తి టౌన్: వనపర్తి పుర కమిషనర్‌గా ఎన్.వెంకటేశ్వర్లు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. మందమర్రి పుర కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది కమిషనర్‌కు అభినందనలు తెలిపారు. బాధ్యతల స్వీకరణ అనంతరం కార్యాలయంలోని రెవెన్యూ, ఇంజినీరింగ్, శానిటరీ, మెప్మా, అకౌంట్ సెక్షన్ల అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఆస్తిపన్ను పూర్తిస్థాయిలో వసూలు చేయడమే ప్రథమ లక్ష్యంగా ముందుకు సాగుతామని.. సహకరించాలని కోరారు.
విద్యార్థుల జీవితాల్లో మార్పునకు కృషి
వనపర్తి విద్యావిభాగం: ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘని కోరారు. విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, కౌన్సెలింగ్‌పై అవగాహన కల్పించేందుకు ప్రతి ఉన్నత పాఠశాల నుంచి ఒక స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుడికి రెండ్రోజుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లాకేంద్రంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. శుక్రవారం జరిగిన ముగింపు కార్యక్రమానికి డీఈఓ హాజరై మాట్లాడారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయాల్సిన అవసరం ఉందని.. సరైన మార్గనిర్దేశం చేస్తే వారి జీవితం విజయవంతం అవుతుందని వివరించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను విద్యార్థులకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్ డైట్ కళాశాల కో–ఆర్డినేటర్ రామకృష్ణ, జిల్లా సమన్వయకర్త మహానంది, జిల్లా రిసోర్స్ పర్సన్‌న్ కృష్ణమోహన్, విష్ణువర్ధన్‌గౌడ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
గద్దర్ గొప్ప కళాకారుడు
వనపర్తి: సామాజిక అసమానతలు, తెలంగాణ సాధన కోసం గళమెత్తిన ప్రజా యుద్ధనౌక గద్దర్ గొప్ప కళాకారుడని జిల్లా పౌరసంబంధాల అధికారి పి.సీతారాం అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో గద్దర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సాంస్కృతిక కళాకారులు, ప్రజాసంఘాల నాయకులతో కలిసి ఆయన హాజరై గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా సాంస్కృతిక కళాకారులు తమ ఆటపాటలతో ఆయన జ్ఞాపకాలను మననం చేసుకున్నారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు సతీష్, గంధం నాగరాజు, చీర్ల చందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment