విద్యార్థులే నిర్వాహకులుగా..
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లో మూడు రోజులపాటు విద్యార్థులు నిర్వహించనున్న సాంకేతిక మహోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 8, 9, 10 తేదీల్లో నిర్వహించనున్న టెక్నోజియాన్–24కు దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు హాజరుకానున్నారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సాంకేతికోత్సవంగా పేరుగాంచిన నిట్ వరంగల్ టెక్నోజియాన్ ప్రత్యేకతను చాటుకుంటుంది. కాగా, ప్రతి ఏడాది సుమారు 6 వేల మంది విద్యార్థులు టెక్నోజియాన్‌లో పాల్గొని సాంకేతిక విజ్ఞానాన్ని పంచుకుంటారు. ఈ మేరకు మంగళవారం టెక్నోజియాన్–24ను ప్రతిబింబించేలా మూడున్నర నిమిషాలతో కూడిన అడ్వాన్స్ టెక్నాలజీతో విద్యార్థులు రూపొందించిన టీజర్‌ను నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ విడుదల చేశారు.
ఒకే ఏడాదిలో రెండుసార్లు..
నిట్‌లో గతేడాది నవంబర్‌లో నిర్వహించాల్సిన్న టెక్నోజియాన్–23ని విద్యార్థుల పరీక్షల కారణంగా వాయిదా వేశారు. ఈ ఏడాది జనవరి 19, 20, 21 తేదీల్లో టెక్నోజియాన్ –24గా నిర్వహించారు. కాగా, ఈ ఏడాదికి సంబంధించిన టెక్నోజియాన్‌ను కూడా ఈనెల 8, 9, 10 తేదీల్లో నిర్వహించేందుకు విద్యార్థులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రత్యేక థీంతో..
నిట్ వరంగల్‌లో 2006లో విద్యార్థులు టెక్నోజియాన్‌కు శ్రీకారం చుట్టారు. నాటి నుంచి ప్రతి ఏడాది టెక్నోజియాన్ నిర్వహిస్తున్నారు. కాగా, ప్రతి ఏడాది ప్రత్యేక థీంతో ముందుకు సాగుతున్నారు. 2018లో ఎకాన్‌ట్రోగా, 2022లో టెక్స్‌టేసీగా, 2023లో (2024 జనవరి) ఇంజీనియస్‌గా నిర్వహించారు. కాగా, ఈ ఏడాది నిర్వహించనున్న టెక్నోజియాన్–24 థీంను 8వ తేదీ సాయంత్రం ఆవిష్కరించనున్నారు.
మూడు రోజులు.. 50కి పైగా ఈవెంట్లు
మూడు రోజులపాటు నిర్వహించే టెక్నోఫెస్ట్ 50కిపైగా ఈవెంట్లతో అలరించనుంది. స్పాట్‌లైట్స్ పేరిట జహాజ్, ఆర్సీ భగ్గీ, హోవర్ మానియా, వర్చువల్ రియాల్టీ, డ్రోన్స్ రేసింగ్, బిల్డ్ యువర్ ఓన్ డ్రోన్, మ్యాట్‌ల్యాబ్స్, టీ వర్క్స్, ఈ–గేమ్స్, ట్రెజర్ హంట్, హాకథాన్ తదితర అంశాలతో కూడిన 50కిపైగా ఈవెంట్లతో సందడి చేయనుంది. వీటితోపాటు గెస్ట్ లెక్చర్స్‌తో అట్టహాసంగా కొనసాగనుంది.
ప్రోషోలు రద్దు..
టెక్నోజియాన్ వేడుకల్లో భాగంగా ప్రతి ఏడాది ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యార్థులు స్పాట్‌లైట్స్, వర్క్‌షాపులతో సాంకేతిక పరిజ్ఞానాన్ని పోటీతత్వంతో పంచుకుంటారు. రాత్రివేళ ప్రోషోలో భాగంగా ముఖ్య అతిథులతో కలిసి ఆటాపాటలతో చిందులు వేస్తారు. ర్యాంపు వాక్‌లతో మోడల్స్ సందడి చేసేవారు. టెక్నాలజీని మాత్రమే పంచుకుందాం.. ప్రోషోలతో చిందులు వద్దని జనవరిలో జరిగిన టెక్నోజియాన్ నుంచి ప్రోషోలను రద్దు చేశారు. అదేబాటలో ఈనెల 8 నుంచి నిర్వహించనున్న టెక్నోజియాన్‌లోను ప్రోషోలను రద్దు చేశారు.
నిట్‌లో 8, 9, 10 తేదీల్లో టెక్నోజియాన్–24
దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద
సాంకేతికోత్సవం
హాజరుకానున్న ఇంజనీరింగ్
కళాశాలల విద్యార్థులు
రేపు సాయంత్రం థీం ఆవిష్కరణ
Comments
Please login to add a commentAdd a comment