ధాన్యాన్ని గోదాములకు తరలించాలి
ఎల్కతుర్తి: కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే గోదాములకు తరలించాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ప్రావీణ్య బుధవారం సందర్శించి సన్నరకం ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 154 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 8 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కమలాపూర్, ఎల్కతుర్తి, ధర్మసాగర్ మండలాల్లో కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులను 24 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 17 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని ఆమె సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
కులగణన సర్వే పరిశీలన..
మండల కేంద్రంలో ప్రారంభమైన కులగణన సర్వేను కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించి మాట్లాడారు. సర్వేలో భాగంగా 1,970 మంది జిల్లాస్థాయి, మండలస్థాయి ఎన్యుమరేటర్లకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఒక్కో బ్లాక్ ఎన్యుమరేటర్లకు ఒక సూపర్‌వైజర్‌ను నియమించినట్లు చెప్పారు. ప్రతీ ఇంటికి స్టిక్కర్ అంటించి సర్వే చేయనున్నట్లు వివరించారు. సర్వే సిబ్బంది వచ్చినప్పుడు ప్రజలు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, పాస్‌బుక్ అందుబాటులో ఉంచుకుని సహకరించాలని కోరారు. ఎవరి ఇళ్లకై నా సిబ్బంది సర్వేకు రాకుంటే అందుబాటులో ఉండే పంచాయతీ కార్యదర్శిని సంప్రదించాలని సూచించారు. ఆమె వెంట డీఆర్‌డీఓ నాగపద్మజ, డీసీఎస్‌ఓ కొమురయ్య, సివిల్ సప్లయీస్ డీఎం మహేందర్, డీపీఎం ప్రకాశ్, ఏడీ లక్ష్మీనారాయణ, తహసీల్దార్ జగత్‌సింగ్, ఏఓ రాజ్‌కుమార్, ఏపీఎం రవీందర్, సీసీ రవీందర్, పంచాయతీ కార్యదర్శి, రైతులు, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment