పాకాలకు మహర్దశ
ఖానాపురం: పర్యాటక రంగంలో పాకాల తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది. కనువిందు చేసే అందాలకు నిలయమైన పాకాలను వీక్షించి ఎవరైనా మంత్రముగ్ధులు కావాల్సిందే. ఇంతటి ప్రాధాన్యం సంతరించుకున్న ఈ ప్రాంతం అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. పర్యాటకుల కోసం ఇటీవల అటవీ శాఖ అధికారులు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వరంగల్ జిల్లాలో ఏకై క పర్యాటక ప్రాంతం పాకాల.. నర్సంపేట పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.. పాకాలకు ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలతోపాటు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తారు. ఆదివారం, సెలవు రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. సరస్సు మధ్యలో ఉండే చిలుకలగుట్ట, మత్తడి ప్రదేశం, తుంగబంధం తూముపై నుంచి అందాలను వీక్షిస్తారు. పలు రకాల జంతువులు, విదేశీ, స్వదేశీ పక్షులకు ఈ అటవీ ప్రాంతం నిలయం. తూముల ద్వారా వచ్చే లీకేజీ నీటిలో జలకాలాడుతూ ఉత్సాహంగా గడుపుతారు. కట్టమైసమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.
త్వరలో బోటింగ్ అందుబాటులోకి..
పాకాలను అభివృద్ధి చేసేందుకు అటవీశాఖ మంత్రి కొండా సురేఖ రూ.50 లక్షల నిధులు విడుదల చేయించారు. వీటితో ప్రస్తుతం బోటింగ్ వద్ద స్వాగత తోరణంతోపాటు పలు అభివృద్ధి పనులు చేపట్టారు. త్వరితగతిన పనులను పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. పనులను ఎప్పటికప్పుడు అటవీశాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అలాగే, నూతన బోట్ల ఏర్పాటు, వాటర్ ఫాల్స్, వాటర్ సైక్లింగ్, జార్బింగ్, వాటర్ రోలింగ్, కట్టపై తూము వరకు రోడ్డు నిర్మాణం, బటర్‌ఫ్లై గార్డెన్ ఆధునికీకరణ, వ్యూ పాయింట్ వద్ద మూడు రిసార్ట్స్, బ్యాటరీ వాహనాలు, బండ్ ప్లాంటింగ్, మెట్ల ఏర్పాటు పనులకు శ్రీకారం చుట్టనున్నారు. వీటిని మార్చిలోపు పూర్తిచేసేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రణాళికాబద్ధంగా పనులు..
పాకాలను అభివృద్ధి చేయడానికి అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. నూతనంగా నాలుగు రిసార్ట్స్, పూర్తిస్థాయిలో రోడ్డు, ట్రెక్కింగ్ పార్కు అభివృద్ధి, భీమునిపాదం, చిలుకలగుట్టతో పాటు పలు ప్రాంతాలకు వెళ్లడానికి సఫారీ, నూతన జిప్‌లైన్, వంతెనలు, చిల్డ్రన్స్ పార్కులు, నూతన రెస్టారెంట్ల నిర్మాణానికి ప్రభుత్వానికి నివేదికలు పంపారు. వీటితోపాటు మరికొన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
నైట్ క్యాంపునకు టెంట్లు..
పాకాలకు వచ్చే పర్యాటకుల కోసం నైట్ క్యాంపింగ్ ఏర్పాటు చేయనున్నారు. గతంలో ఏర్పాటు చేసినప్పుడు పర్యాటకుల నుంచి మంచి స్పందన వచ్చింది. విద్యుత్, ఇతర సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చి ఐదు నైట్ క్యాంపింగ్ టెంట్లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో రాత్రి సమయంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు బసచేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
పనులు ప్రారంభించాం..
పాకాల పర్యాటక ప్రాంతాన్ని ఆధునికీకరిస్తాం. మంజూరైన నిధులతో పనులు ఇప్పటికే ప్రారంభించాం. మార్చిలోపు ఆ పనులు పూర్తిచేయిస్తాం. బోటింగ్‌ను సైతం త్వరలో పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తాం. ఉన్నతాధికారుల సూచనలతో ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షిస్తూ వేగవంతం చేస్తున్నాం.
– రవికిరణ్, ఎఫ్‌ఆర్వో, నర్సంపేట
రూ.50 లక్షల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం
బోటింగ్ వద్ద స్వాగత తోరణం నిర్మాణం
మరిన్ని పనులకు అధికారుల ప్రణాళికలు
మారనున్న పర్యాటక ప్రాంత రూపురేఖలు
Comments
Please login to add a commentAdd a comment