కొలువుదీరిన కొత్త ఉద్యోగులు
హన్మకొండఅర్బన్: ఇటీవల జిల్లాలో గ్రూప్–4 ద్వారా ఎంపికైన ఉద్యోగుల్లో 11 మంది రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగాలు పొందిన విషయం తెలిసిందే. కాగా.. సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో వారికి ప్రజల నుంచి స్వీకరించిన వినతులు ఆన్‌లైన్ చేసి రశీదులు అందజేసే బాధ్యతలను అధికారులు అప్పగించారు.
ఇద్దరు ఎస్సైల బదిలీ
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఎస్సైలను బదిలీ చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ధర్మసాగర్ పోలీస్‌స్టేషన్ ఎస్సైగా పని చేస్తున్న నర్సింహారావును సీసీఆర్‌బీకి, ఐటీ కోర్ ఎస్సైగా పని చేస్తున్న పి.రాజ్‌కుమార్‌ను మడికొండ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
‘కలెక్టరేట్‌లో వేడుకల్లేవ్’
హన్మకొండ అర్బన్: నూతన సంవత్సరం–25 సందర్భంగా హనుమకొండ కలెక్టరేట్‌లో ఎలాంటి వేడుకలు, ఉత్సవాలు నిర్వహించడం లేదని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మృతి నేపథ్యంలో సంతాప దినాలు ప్రకటించినందున వేడుకలు, ఉత్సవాలు నిర్వహించడం లేదని పేర్కొన్నారు. మర్యాద పూర్వకంగా తనను కలిసే అధికారులు, సంఘాల నాయకులు, ఎన్‌జీఓలు ఉదయం 10.30 గంటలకు క్యాంపు కార్యాలయానికి రావాలని సూచించారు.
రాష్ట్రస్థాయిలో పతకాలు
సాధించాలి: డీవైఎస్‌ఓ
వరంగల్ స్పోర్ట్స్: సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు తీసుకురావాలని హనుమకొండ డీవైఎస్‌ఓ గుగులోతు అశోక్‌కుమార్ అన్నారు. నేటి(మంగళవారం) నుంచి జనవరి 2 వరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలకు ఎంపికై న బాక్సర్లు సోమవారం బయల్దేరి వెళ్లారు. క్రీడాకారులకు డీఎస్‌ఏ ఆధ్వర్యంలో ట్రాక్‌సూట్లను అందజేశారు. ఈసందర్భంగా డీవైఎస్‌ఓ అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి పోటీల్లో అత్తుత్తమ ప్రతిభ కనబర్చాలని క్రీడాకారులకు సూచించారు. కార్యక్రమంలో భూపాలపల్లి డీవైఎస్‌ఓ సీహెచ్ రఘు, పీడీ పార్థసారథి, ఎన్‌ఐఎస్ డిప్లొమా ఎస్.నరేంద్రదేవ్, బాక్సింగ్ కోచ్ శ్యామ్‌సన్, జయపాల్ పాల్గొన్నారు.
డీఈఈసెట్‌కు
వెబ్ ఆప్షన్ల అవకాశం
విద్యారణ్యపురి: డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్‌ఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్‌ఈ)లో అర్హత సాధించిన అభ్యర్థులు, ఇదివరకు మొదటి, రెండో, మూడో దశలో వెబ్ ఆప్షన్లు ఇవ్వని అభ్యర్థులకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం కల్పించినట్లు హనుమకొండ ప్రభుత్వ డైట్ ప్రిన్సిపాల్ ఎండీ అబ్దుల్‌హై సోమవారం తెలిపారు. జనవరి 2 నుంచి 4 వరకు వెబ్ ఆఫ్షన్లు ఇచ్చుకోవాలన్నారు. రిజర్వేషన్, మెరిట్ ప్రాతిపదికన జనవరి 9న సీట్లు కేటాయిస్తారని పేర్కొన్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు జనవరి 9 నుంచి 13 వరకు ఫీజు చెల్లించి ఫైనల్ అడ్మిషన్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. జనవరి 16న తమకు సీటు వచ్చిన డైట్ కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment