జీడబ్ల్యూఎంసీలో టెండ‘రింగ్’
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్‌లో ఐదేళ్ల తర్వాత మళ్లీ సిండికేట్ వ్యవహారానికి ఆధిపత్యం నడుస్తోంది. ‘ఆన్‌లైన్’ టెండర్ ప్రక్రియ ఉన్నప్పటికీ కూటమి(రింగ్) దందా ఆగడం లేదు. ఇంజినీర్లు తయారు చేసిన అంచనా, వ్యయమే కాదు దాన్ని మించి కూడా దోచుకునేందుకు బడా కాంట్రాక్టర్లు వ్యూహాలు పన్నుతున్నారు. ఇందుకు తాజాగా బల్దియాలో సుమారు రూ.20 కోట్లతో స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్(ఎస్‌డీఎఫ్), జనరల్ ఫండ్‌తో 80 సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. సిండికేట్‌కు నేతృత్వం వహిస్తున్న బడా కాంట్రాక్టర్ ‘బాస్’ ఆదేశాలు లేనిదే టెండర్ వేయకూడదని హుకుం జారీ చేశారు. ఈ పనులకు 15 మంది కాంట్రాక్టర్లు సిండికేట్ వ్యవహారాన్ని వ్యతిరేకించి టెండర్లు దాఖలు చేశారు. దీంతో ఓ బడా కాంట్రాక్టర్ ఎంట్రీ ఇచ్చి, బెదిరింపులకు పాల్పడుతున్నట్లు చిన్న కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెక్నికల్ బెడ్ తెరిచేలోగా ఇంజినీర్లకు లేఖలు అందజేసి తప్పుకోవాలని లేదంటే పరిణామాలు మరోలా ఉంటాయని హెచ్చరికలు చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ‘నా ఇష్టం’ అన్న ఓ చిన్న కాంట్రాక్టర్‌ను ఓపోలీస్ స్టేషన్‌లో అప్పగించడంపై ఆనేక విమర్శలు వస్తున్నాయి. పోలీసులు మాత్రం తాము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని దాట వేస్తుండడం గమనార్హం. నెల రోజుల కిందట జరిగిన అభివృద్ధి పనుల్లో ఇదే తరహాలో పనులన్నీ కొంత మంది కాంట్రాక్టర్లు దక్కించుకుంటున్నారని, ప్రజాప్రతినిధుల ఆశీస్సులూ పుష్కలంగా ఉన్నాయంటున్నారు. అంతేకాకుండా ఇంజినీర్లు తమ సహకారం అందిస్తున్నారని వాపోతున్నారు.
సిండికేట్ సభ్యులకు పనుల పంపిణీ
‘బాస్’ ఆదేశాలు అతిక్రమిస్తే కటకటాలే
మితిమీరిన బడా కాంట్రాక్టర్ల వ్యవహారం
Comments
Please login to add a commentAdd a comment