అలర్ట్.. అలర్ట్
సాక్షి, వరంగల్ :
సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ అంతర్ రాష్ట్ర ముఠాలు పంజా విసురుతున్నాయి. ఉదయం వేళ రెక్కీ చేస్తున్న ఆయా ముఠాల సభ్యులు.. రాత్రి వేళ తమ ప్రణాళికను విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఈనెల మూడో తేదీ అర్ధరాత్రి దాటాక వరంగల్ నగరంలో నాలుగు చోరీలు చేయడం జనాలను ఆందోళనకు గురి చేస్తోంది. ముఖ్యంగా ఖమ్మం జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న వైన్స్‌షాపులో రూ.54 వేలు, మామూనూరు పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న రెగ్జిన్, క్యాప్స్, కూలింగ్ గ్లాసులు విక్రయించే ఓ డబ్బాలో రూ.50 వేల విలువైన సామగ్రి, మడికొండలోని ఓ వైన్ షాపులో రూ.20 వేల నగదుతోపాటు గ్రేటర్ వరంగల్ 43వ డివిజన్ గవిచర్ల క్రాస్‌రోడ్డులోని శేషాద్రి హిల్స్‌లో తాళం వేసిన ఓ ఇంట్లో చొరబడి రూ.లక్ష విలువ చేసే బంగారాన్ని చోరీ చేయడం కలకలం సృష్టిస్తోంది.
పోలీసులు అప్రమత్తం..
నగరానికి చెందిన అనేక మంది సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్నారు. ఈక్రమంలో ఈ ముఠాలు అందినకాడికి దండుకునే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గతేడాది నవంబర్‌లో రాయపర్తి ఎస్‌బీఐలో జరిగిన 19 కిలోల బంగారం చోరీ పోలీసులకు సవాల్ విసురుతోంది. ఇప్పుడు కూడా అదే తరహాలో ఇళ్లలో చోరీ జరిగే అవకాశముందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా అంతరాష్ట్ర ముఠా చోరీలు చేస్తుండడంతో అప్రమత్తంగా ఉండాలని వరంగల్ కమిషనరేట్ పోలీసులు కోరుతున్నారు.
ఊరెళితే సమాచారం ఇవ్వాలి...
సంక్రాంతి వేళ కాజీపేట, హనుమకొండ, వరంగల్ ప్రాంతాల్లోని చాలా కుటుంబాలు సొంతూళ్లకు వెళ్తాయి. ఈక్రమంలో నగరంలో చాలా చోట్ల తాళం వేసిన ఇళ్లే దర్శనమిస్తాయి. ఇదే అదునుగా అంతర్ రాష్ట్ర ముఠా దొంగలు దోపిడీకి తెగించే అవకాశం ఉంది. తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్‌గా రెక్కీ నిర్వహిస్తున్నట్లు తాజాగా గవిచర్ల క్రాస్‌రోడ్డులోని ఓ ఇంట్లో దొంగతనం సమయంలో లభించిన సీసీటీవీ ఫుటేజీలు చెబుతున్నాయి. దీంతో పోలీసులు నగరవాసులను అప్రమత్తం చేస్తున్నారు. ఇంటికి తాళం వేసి సొంతూళ్లకు వెళ్లేటప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇచ్చి వెళ్లాలని వారు సూచిస్తున్నారు.
పండుగకు ఊరెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..
వరంగల్ నగరంలో వరుస
చోరీలతో ఆందోళన
తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా
అంతర్ రాష్ట్ర ముఠా పంజా
ఒక్క రోజులోనే నాలుగు
దొంగతనాలతో హల్‌చల్
ఠాణాలో వివరాలు ఇస్తే ఆయా
ప్రాంతాల్లో పెట్రోలింగ్
అప్రమత్తంగా లేకుంటే అంతే..
2024లో 948 చోరీలు జరిగితే 519 కేసులను పోలీసులు ఛేదించారు. రూ.24,68,26,130 సొత్తు పోతే రూ.7,18,34,683 మాత్రమే రికవరీ చేయగలిగారు. కేసుల పరిష్కారం 54.75 శాతం ఉంటే రికవరీ 29.10 శాతం మాత్రమే ఉంది. ఈ నేరాలకు పాల్పడిన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 18 ముఠాల్లోని 45 మందిని అరెస్టు చేశారు. సంక్రాంతి పండుగ వేళ ఈ అంతర్ రాష్ట్ర ముఠా కదలికలు ఉండడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అదేసమయంలో పోలీసులకు దొంగలు సవాల్ విసురుతుండడం గమనార్హం. గవిచర్ల క్రాస్‌రోడ్డులోని సూర్యచంద్ర హిల్స్‌లో తాళం వేసిన ఇంట్లో దొంగలు చోరీకి ప్రయత్నించారు. అక్కడ వీలుకాకపోవడంతో సమీపంలోని శేషాద్రి హిల్స్‌లో చోరీ చేశారు. పోలీసులు, ప్రజలు అప్రమత్తంగా లేకపోతే ఎక్కువగా చోరీలు జరిగే అవకాశం ఉంది.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే రక్షణ
సంక్రాంతికి సొంతూరికి వెళ్లే ముందు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయకండి. ఎప్పటిలాగే డోర్‌మ్యాట్ కింద, చెప్పుల స్టాండ్లలో తాళాలు వదిలి వెళ్లకండి. గ్రామాలకు వెళ్లి మూడు రోజుల పాటు పండుగ చేసుకుంటే.. మీకు తెలియకుండా ఇచ్చే సమాచారంతో దొంగలు కూడా మీ ఇంట్లో చోరీ చేసి పండుగ చేసుకునే అవకాశం ఉంది. ఇళ్లకు తాళాలు వేయాలి. వీలైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే రక్షణగా ఉంటుంది. స్థానిక పోలీస్ స్టేషన్‌లో మీ ఇంటి నంబర్, సెల్‌ఫోన్ నంబర్ ఇవ్వడం ద్వారా ఆయా ప్రాంతాల్లో గస్తీ మరింత పెంచే అవకాశం ఉంటుంది. – అంబర్ కిశోర్ ఝా, వరంగల్ పోలీస్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment