స్థానిక సమరానికి సై | - | Sakshi
Sakshi News home page

స్థానిక సమరానికి సై

Published Wed, Jan 8 2025 1:08 AM | Last Updated on Wed, Jan 8 2025 1:08 AM

స్థాన

స్థానిక సమరానికి సై

హన్మకొండ: స్థానిక సంస్థల ‘సమరానికి’ ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనేది స్పష్టంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించనప్పటికీ.. ఎన్నికల సామగ్రి సమకూర్చుకుంటున్నది. ఏ క్షణాన్నైనా ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడవచ్చనే సంకేతాలు దీనిద్వారా తెలుస్తోంది. మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గ(ఎంపీటీసీ), జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజవర్గాల(జెడ్పీటీసీ) ఎన్నికలను జిల్లా పరిషత్‌ల ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్వహిస్తుంది. ఈ క్రమంలో జిల్లా పరిషత్‌లకు మెటీరియల్‌ సరఫరా చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయి. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగుతాయి. ఎన్నికలకు అవసరమైన కవర్లు, బ్యాలెట్‌ పత్రాలకు సంబంధించిన పేపర్‌, ఎన్నికల నియమావళికి, ఎన్నికల మార్గదర్శకాల కరదీపికలు జెడ్పీలకు చేరుకున్నాయి. నామినేషన్ల స్వీకరణ, ఉప సంహరణ అనంతరం బ్యాలెట్‌ పత్రాలు ముద్రిస్తారు. అయితే, బ్యాలెట్‌ పత్రాలకు అవసరమైన పేపర్‌ను ముందుగానే జిల్లాకు ఎన్నికల కమిషన్‌ చేరవేసింది.

పునర్విభజనతో మారిన జిల్లాలు..

జిల్లాల పునర్విభజనతో పూర్వ వరంగల్‌ను.. వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, జనగామ, మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలుగా ఏర్పాటు చేశారు. గత స్థానిక సంస్థల ఎన్నికలు ఈ జిల్లాల ప్రాతిపదికన జరిగాయి. అయితే వరంగల్‌ అర్బన్‌ను హనుమకొండగా, వరంగల్‌ రూరల్‌ను వరంగల్‌ జిల్లాగా పునర్విభజించారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా పరిషత్‌ పరిధిలో ఏడు మండలాలు, వరంగల్‌ రూరల్‌ జెడ్పీ పరిధిలో 16 మండలాలు ఉన్నాయి. ఈ రెండు జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణతో హనుమకొండ జిల్లాలో 12 మండలాలు, వరంగల్‌ జిల్లాలో 11 మండలాలు చేరాయి. వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని పరకాల, శాయంపేట, దామెర, నడికూడ, ఆత్మకూరు మండలాలను హనుమకొండ జిల్లాలో కలిపారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని ఐనవోలు, హసన్‌పర్తి, వేలేరు, ధర్మసాగర్‌, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్‌తో పాటు వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిషత్‌ పరిధిలోని పరకాల, శాయంపేట, దామెర, నడికుడ, ఆత్మకూరు మండలాలను కలిపి హనుమకొండ జిల్లా పరిషత్‌గా ఏర్పాటు చేశారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

పంచాయతీరాజ్‌ చట్టంలో మార్పు..

గత ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు పర్యాయాలకు రిజర్వేషన్లు అమలయ్యేలా చట్టం చేసింది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం మరోసారి పంచాయతీరాజ్‌ చట్టంలో మార్పు చేసింది. రిజర్వేషన్లు ఒక పర్యాయానికి వర్తించేలా మార్పులు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ముందుగా ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా.. జెడ్పీ చైర్‌పర్సన్లు, మండల పరిషత్‌ అధ్యక్షుల రిజర్వేషన్లు ఖరారైతే రాజకీయ ముఖచిత్రం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆశావహులు మాత్రం రిజర్వేషన్లు కలిసి వస్తే ఎలాగైనా పోటీ చేయాలనే ఆసక్తితో రాజకీయ పెద్దలను ప్రసన్నం చేసుకుంటున్నారు. పోలింగ్‌ బూత్‌ల పరిశీలనకు ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకుంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై స్పష్టత వస్తుంది.

త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు

జెడ్పీకి చేరిన ఎన్నికల సామగ్రి

సమాయత్తమవుతున్న రాజకీయ పార్టీలు

ఆశావహుల సమాయత్తం..

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ జిల్లాలకు ఎన్నికల సామగ్రి పంపిస్తున్నట్లు ప్రచారం కావడంతో రాజకీ య పార్టీలు, ఆశావహులు ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. పార్టీల వారీగా జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీల అగ్రనాయకుల మెప్పు కోసం తాపత్రయపడుతున్నారు. టికెట్‌ దక్కించుకునేందుకు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల దృష్టిని ఆకర్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరో వైపు అధికార పార్టీ స్థానిక సంస్థలను పూర్తి స్థాయిలో కై వసం చేసుకోవాలని ఇప్పటి నుంచే నాయకులకు సూచనలు చేసింది. మరో వైపు విపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రణాళికతో ముందుకు పోతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
స్థానిక సమరానికి సై 1
1/1

స్థానిక సమరానికి సై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement