![ఏసీబీకి చిక్కిన ఏఈ, అసిస్టెంట్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10hmkd277-330130_mr-1739216665-0.jpg.webp?itok=76Dj1Z5s)
ఏసీబీకి చిక్కిన ఏఈ, అసిస్టెంట్
వరంగల్ క్రైం: ఉమ్మడి వరంగల్ జిల్లాలో అవినీతి అధికారులు వరుసగా ఏసీబీకి చిక్కుతున్నారు. ఈనెల 7న రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ ఘటన మరువక ముందే.. సోమవారం హనుమకొండ సుబేదారిలోని డీమార్ట్ సమీపంలో పంచాయతీరాజ్ ఏఈ కంకణాల రమేశ్‌ను ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. వరంగల్ అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో వరంగల్ పంచాయతీరాజ్ ఏఈ కంకణాల రమేశ్ సంగెం మండలం కుంటపల్లి గ్రామంలో ఇంటి నిర్మాణ అనుమతి కోసం ఫిర్యాదుదారుడు పెట్టుకున్న దరఖాస్తును ప్రాసెస్ చేయడం కోసం రూ.10 వేలు డిమాండ్ చేశాడు. విసిగిపోయిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అఽధికారులు సోమవారం ఉదయం పని నిమిత్తం బాధితుడు ఏఈ కంకణాల రమేశ్‌ను కలిశారు. తన అసిస్టెంట్ (ప్రైవేట్) గుగులోతు సారయ్యను కలిసి డబ్బులు ఇవ్వాలని సూచించగా.. బాధితులు డీమార్ట్ దగ్గర్లోని షాపు వద్దకు రావాలని అడ్రస్ చెప్పారు. కాగా.. షాప్ వద్దకు వచ్చి ఏఈ అసిస్టెంట్ గుగులోతు సారయ్యకు డబ్బులు ఇస్తుండగా అక్కడే ఉన్న ఏఈ రమేశ్‌ను, అసిస్టెంట్ సారయ్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈవిషయంపై ఏసీబీ డీఎస్పీ సాంబయ్య మాట్లాడుతూ.. బాధితుల విజ్ఞప్తి మేరకు వారి వివరాలు గోప్యంగా ఉంచామని, నిందితులు పంచాయతీ రాజ్ ఏఈ కంకణాల రమేశ్, ఆయన అసిస్టెంట్ గుగులోతు సారయ్యను ఏసీబీ కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ అధికారులెవరైనా పనుల కోసం లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, వరంగల్ డీఎస్పీ నంబర్ 94404 46106కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఆయన కోరారు.
ఇంటి నిర్మాణ అనుమతికి
రూ.10 వేలు డిమాండ్
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు
Comments
Please login to add a commentAdd a comment