తూర్పు కాపులకు ఓబీసీ సర్టిఫికెట్లు ఇవ్వాలి
తణుకు టౌన్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తూర్పు కాపులను బీసీ డీ జాబితాలో చేర్చి విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించే విధంగా కృషి చేస్తామని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, ఎన్‌ఆర్‌ఐ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు చెప్పారు. ఆదివారం తణుకులో తూర్పు కాపు విద్య, విజ్ఞాన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సమారాధనలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మాజీ మున్సిపల్ చైర్మన్ రాష్ట్ర తూర్పు కాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బలగం సేతుబందన సీతారామ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా తూర్పు కాపు సంఘం నాయకులు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణ తూర్పు కాపులకు మైగ్రేషన్ సర్టిఫికెట్‌తో సంబంధం లేకుండా బీసీ డీ కోటాలో రిజర్వేషన్ అమలు చేశారని చెప్పారు. ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలకే తూర్పు కాపులకు ఓబీసీ సర్టిఫికెట్లు ఇస్తున్నారని, ఈ పద్ధతిలోనే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల తూర్పు కాపులకు సర్టిఫికెట్లు అందజేయాలని కోరారు. మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్‌పర్సన్ పాలవలస యశస్విని పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment