వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా జెట్టి గురునాథరావు
జంగారెడ్డిగూడెం: పట్టణానికి చెందిన సీనియర్ నాయకుడు జెట్టి గురునాథరావు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. జెట్టి గురునాథరావు ఎన్నికల ముందు పోలవరం నియోజకవర్గ పరిశీలకుడిగా పని చేశారు. ఇటీవల పార్టీలో క్రియాశీలక నేతగా వ్యవహరిస్తున్నారు. దీంతో అధిష్టానం ఆయన సేవలు గుర్తించి, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించింది.
ప్రజలకు అండగా నిలవాలి
పెనుగొండ: ప్రజలకు అండగా నిలిచి, వారి సమస్యల పరిష్కారానికి పోరాటం చేయాలని మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. మంగళవారం తూర్పుపాలెం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని సమస్యలను నాయకులు కార్యకర్తలు మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలను మభ్యపెట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రజలు ఇప్పటికే సంక్షేమం అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఎన్నికష్టాలు వచ్చినా మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో వెనుకంజ వేయలేదన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు సుంకర సీతారామ్, జక్కంశెట్టి శ్రీరాములు, బుర్రా రవికుమార్, రామన వీర్రాజు, నాయకులు కర్రి వేణుబాబు, కోట వెంకటేశ్వరరావు, గుబ్బల వీర బ్రహ్మం, తాతాజీ చింతపలి గురు ప్రసాద్, కొవ్వూరి చిన్న, పూరిళ్ల శ్రీను, రుద్ర ప్రసాద్, సుంకర నాగబాబు, సాకా సుబ్రహ్మణ్యం, మేడిచర్ల పండులు పాల్గొన్నారు.
స్కూళ్ల పనివేళల మార్పుతో ఇబ్బందులు
భీమవరం: ప్రభుత్వ పాఠశాలల పని వేళలు పెంచడాన్ని ఏపీటీఎఫ్ జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తుందని ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.ప్రకాశం, బీవీ నారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాలోని విద్యార్థులు దాదాపు 10 కిలోమీటర్లు దూరం కాలినడకన లేదా సైకిల్, బస్సు వంటి వాహనాల ద్వారా పాఠశాలలకు వచ్చి వెళ్లాల్సి ఉంటుందని ఇలాంటి తరుణంలో సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలలు నిర్వహిస్తే విద్యార్థులు ఇళ్లకు చేరుకోవడం తీవ్ర ఇబ్బందికరంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా ఉన్నత పాఠశాలల బాలికలు నివాసాలకు చేరుకునే సమయంలో అనేక ఇబ్బందులు, ప్రమాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. పాఠశాలల పనివేళల సమయం పెంచడం వల్ల పొందే లాభం కంటే నష్టాలు ఎక్కువగా ఉంటాయని వివరించారు.
23న మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సమావేశం
ఏలూరు (టూటౌన్): ఈ నెల 23న జంగారెడ్డిగూడెం లయన్స్ క్లబ్ హాలులో జరిగే మున్సిపల్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) జనరల్ బాడీ సమావేశం జయప్రదం చేయాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. స్థానిక ఏఐటీయూసీ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవన్‌లో కరపత్రాల్ని మంగళవారం ఆవిష్కరించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజారోగ్యంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమన్నారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, ఆప్కాస్ విధానాన్ని రద్దుచేసి కార్మికులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్వచ్చాంధ్ర కార్పొరేషన్ డ్రైవర్లకు రూ.18,500 ఇవ్వాలని, పర్మినెంట్ కార్మికులకు సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఆర్జిత సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 23న జంగారెడ్డిగూడెంలోని లయన్స్ క్లబ్ హాల్లో జనరల్ బాడీ సమావేశం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో దొడ్డికార్ల నాగబాబు, యలగాడ దుర్గారావు, కసింకోట నాగేంద్ర, ఇంటి అశోక్, డి రవీంద్ర పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment