హమాలీల జీతాలు పెంచాలి
ఏలూరు (టూటౌన్): పౌరసరఫరాల శాఖలో పనిచేస్తున్న హమాలీలకు ప్రతి రెండేళ్ల ఒకసారి జీతాలు పెంచుతూ ఒప్పందం చేసుకున్నారని, 2024 జనవరి కల్లా ఆ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉన్నా ఇంతవరకు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఏపీ పౌరసరఫరాల సంస్థ గోడౌన్స్ జట్టు వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా హమాలీలు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు, యూనియన్ జిల్లా అధ్యక్షులు శేఖర్ మాట్లాడుతూ యూనియన్‌తో చర్చలు జరిపి తక్షణమే హమాలీల జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఒప్పంద కాలం పూర్తయి 11 నెలలైనా ప్రభుత్వాలు స్పందించకపోవడం దారుణమన్నారు. పౌరసరఫరాల శాఖలో మండల గ్రామ స్థాయిలో నిత్యావసరాలను రేషన్ షాపులకు చేరవేసే కార్మికుల కష్టానికి వెలకట్టలేమన్నారు. కార్మికులు ఎంతో కష్టపడి సరుకులను మండల స్టాక్ పాయింట్ల నుంచి గ్రామాల్లో ఉన్న రేషన్ షాపులకు చేరవేస్తున్నారని తెలిపారు ఒక్కరోజు కూడా లేట్ కాకుండా పనిచేస్తున్నామని తమ కష్టాన్ని ఈ ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలని కోరుతూ ఏలూరు జిల్లాలోని ఏలూరు, పాతూరు, ధర్మాజీ గూడెం, జంగారెడ్డిగూడెం, కుకునూరు, కేఆర్ పురం, నూజివీడు, కై కలూరు ఎంఎల్‌ఎస్ పాయింట్ల వద్ద కార్మికులు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమాల్లో రాంబాబు, దుర్గారావు, మస్తాన్ వలి, ముప్పిడి అబ్బులు తదితరులు నాయకత్వం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment