మహిళలు, బాలికల రక్షణకు ప్రత్యేక చర్యలు | - | Sakshi
Sakshi News home page

మహిళలు, బాలికల రక్షణకు ప్రత్యేక చర్యలు

Published Wed, Nov 20 2024 12:48 AM | Last Updated on Wed, Nov 20 2024 12:48 AM

మహిళలు, బాలికల రక్షణకు ప్రత్యేక చర్యలు

మహిళలు, బాలికల రక్షణకు ప్రత్యేక చర్యలు

ద్వారకాతిరుమల: ఏలూరు జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో మహిళలు, బాలికల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఏలూరు రేంజ్‌ ఐజీ జీవీజీ అశోక్‌ కుమార్‌ తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం ద్వారకాతిరుమల పోలీస్టేషన్‌కు విచ్చేసిన ఆయనకు సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. జిల్లా ఎస్పీ కె.ప్రతాప్‌ శివకిషోర్‌తో కలిసి క్రైం రికార్డులు పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతి జిల్లాలో మహిళలు, బాలికల రక్షణకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. జిల్లాలో అభయ పేరుతో ఈ టీం పనిచేస్తుందన్నారు. కాలేజీలు, పాఠశాలలు, బస్టాప్‌లు ఇతర ముఖ్య ప్రదేశాల్లో ఈవ్‌ టీజింగ్‌, ఇతర నేరాలు జరగకుండా ఈ టీంలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రెగ్యులర్‌గా కాలేజీలు, పాఠశాలల్లో ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. చిన్న పిల్లలపై నేరాలకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి సారించామని, అందులో భాగంగా వారిపై రౌడీ షీట్లు, సస్పెక్ట్‌ షీట్లు తెరిచి, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. గంజాయి కేసుల్లో త్వరితగతిన విచారణను పూర్తి చేసి, ముద్దాయిలను అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపి, చార్జ్‌షీట్లను దాఖలు చేస్తున్నామన్నారు. ఐదు, పదేళ్లుగా తమ రికార్డుల్లో ఉన్న గంజాయి, దొంగతనాలు, పోక్సో కేసుల్లోని నేరస్తుల ఫొటోలు, వారి వేలిముద్రలను డిజిటలైజ్‌ చేస్తున్నట్టు తెలిపారు. శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే శనివారం, ఇతర పర్వదినాల్లో జేబు దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆలయానికి భద్రత కల్పించడంతో పాటు, భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని వేళల్లో, ముఖ్యంగా పర్వదినాల్లో జరిగే ఉత్సవాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ద్వారకాతిరుమల పోలీస్టేషన్‌ పరిధిలో పెద్ద సమస్యలేమీ లేవని, శాంతి భద్రతలు కూడా బాగానే ఉన్నాయన్నారు.

చిన్న వెంకన్నను దర్శించుకున్న ఐజీ

చినవెంకన్న ఆలయాన్ని ఐజీ జీవీజీ అశోక్‌ కుమార్‌, ఎస్పీ కె.ప్రతాప్‌ శివ కిషోర్‌లు మంగళవారం సందర్శించారు. వారికి దేవస్థానం అధికారులు, అర్చకులు తూర్పు రాజగోపురం వద్ద మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. వారు స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు వారికి శ్రీవారి శేష వస్త్రాలను కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలుకగా, ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్‌ మూర్తి స్వామివారి మెమెంటోలు, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ డి.శ్రావణ్‌ కుమార్‌, భీమడోలు సీఐ యూజే విల్సన్‌, ద్వారకాతిరుమల, భీమడోలు ఎస్సైలు టి.సుధీర్‌, సుధాకర్‌ తదితరులు ఉన్నారు.

ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌ కుమార్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement