కేడర్ నో.. చంద్రబాబు ఎస్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు నగర టీడీపీ కేడర్ నో చెప్పినా.. ఆళ్ల నానిని పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందంటూ సోషల్ మీడియా మొదలుకొని స్థానికంగా సమావేశాలు నిర్వహించి ఆళ్ల నానిపై అసమ్మతి సెగ వినిపించారు. కేడర్ అభిప్రాయాలను ఎమ్మెల్యే బడేటి చంటి ఒకటికి రెండు సార్లు చంద్రబాబుకు చెప్పినా వినలేదు. చివరకు బడేటి చంటితోనే ఆళ్ల నాని టీడీపీలో చేరతారని ప్రకటన చేయించడం చర్చనీయాంశంగా మారింది.
కేడర్‌ను పట్టించుకోని అధిష్టానం
గతంలో నాని వల్ల వ్యక్తిగతంగా తమకు తీవ్ర నష్టం జరిగిందంటూ పెద్ద ఎత్తున అధిష్టానానికి ఏలూరు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ప్రధానంగా కొందరు నేతలను టార్గెట్ చేసి నాని వేధించారంటూ పూర్తి ఆధారాలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్‌కు అందించారు. ఈ క్రమంలో కార్యకర్తల ఇష్టానికి వ్యతిరేకంగా పార్టీ నడుచుకోదని ఏలూరు నగర నేతలందరితో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ వ్యవహారాన్ని సమన్వయ పరిచే బాధ్యత అచ్చెన్నాయుడుకు అప్పగించారు. డిసెంబర్ 3న నాని టీడీపీలో చేరడం ఖరారు కావడంతో నగర టీడీపీ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించి మరీ తీవ్ర విమర్శలు గుప్పించారు. దాంతో నాని చేరిక వా9వ తేదిన చేరతారని ప్రచారం చేయగా చివరిగా బుధవారం చేరుతున్నట్లు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రకటించడంతో కేడర్ అవాక్కయ్యారు. అయితే ఎలాంటి సమావేశం నిర్వహించకపోవడం, పార్టీ ముఖ్యులు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో కేడర్ అసహనంతో రగిలిపోతున్నారు. ఎమ్మెల్యే ఉదయం నుంచి అందర్ని సర్దుబాటు చేసే పనిలో నిమగ్నమైనా ప్రయోజనం పెద్దగా కనపడని పరిస్ధితి.
మనం చెప్పాల్సింది చెప్పాం
ఆళ్ల నాని చేరిక నేపథ్యంలో మంగళవారం ఎమ్మెల్యే బడేటి చంటి నేతృత్వంలో నగర సమావేశం నిర్వహించారు. టీడీపీ నేతలు ఎస్‌ఎంఆర్ పెదబాబు, కంప్యూటర్ ప్రసాద్‌తో సహా ముఖ్యులందరూ హాజరయ్యారు. కేడర్ మనోభావాలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవద్దని కార్యకర్తలు పడిన ఇబ్బందులు, గతంలోనే చంద్రబాబుకు వివరించానని ఎమ్మెల్యే అన్నారు. ఈ క్రమంలో నగర టీడీపీ నేతలతో అధిష్టానం ప్రత్యేక సమావేశం నిర్వహించి నిర్ణయం ప్రకటిస్తుందని చెప్పారు. అయితే సమావేశం నిర్వహించలేదు. రేపు నాని చేరిక ఉంటుందని తనకు సమాచారం ఇచ్చారని, పోలవరం పర్యటనలో కూడా ముఖ్యమంత్రి అదే చెప్పారని బడేటి చంటి కార్యకర్తలకు వివరించారు. కార్యకర్తలందరిని సర్దుకోమని సూచిస్తూ ఆళ్ళ నానిని స్వాగతిస్తున్నామని ప్రకటించారు. ఎందుకు పార్టీలో చేరుతున్నారో నానినే సమాధానం చెబుతారని తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటలలోపు నాని చేరతారని తెలిపారు.
నేడు టీడీపీలో చేరనున్న మాజీ మంత్రి ఆళ్ల నాని
ఏలూరు టీడీపీ కేడర్‌ను పట్టించుకోని అధిష్టానం
నగర నేతల నిరసనలకు స్పందన నిల్
నాని చేరికను ప్రకటించిన ఎమ్మెల్యే బడేటి చంటి
Comments
Please login to add a commentAdd a comment