బకాయిలు తక్షణం చెల్లించాలి
భీమవరం: పెండింగ్‌లోని స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం భీమవరంలోని శ్రీగ్రంధి వేంకటేశ్వరరావు(జీవీఆర్) ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడలిలో ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్‌ఏ) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఏఐఎస్‌ఏ జిల్లా కార్యదర్శి టి.అప్పలస్వామి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు దాదాపు రూ.3,500 కోట్లు ఉన్నాయన్నారు. బకాయిలు విడుదల కాకపోవడం వల్ల ఇంజనీరింగ్, పీజీ, డిప్లమో కోర్సులు పూర్తయిన విద్యార్థులకు సంబంధిత కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సర్టిఫికెట్లు లేకపోవడం వల్ల ఉన్నత చదువులు, ఉద్యోగాలకు వెళ్లే పరిస్థితి లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఏ నాయకులు మురళి, బి.దినేష్, వి.భార్గవ్, టి.దేవరాజ్, బి.లక్ష్మి పాల్గొన్నారు.
పరీక్ష పేపర్లు అధికారులే పంపాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రస్తుతం జరుగుతున్న సెల్ఫ్ అసెస్‌మెంట్ టెర్మ్–1 మోడల్ పేపర్ పరీక్షా పత్రాలను పోలీస్ స్టేషన్ల నుంచి ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజూ తెచ్చుకొని పరీక్ష పెట్టాలన్న నిర్ణయం సరైనది కాదని పీఆర్‌టీయూ ఏలూరు జిల్లా అధ్యక్షుడు పువ్వుల ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి కేవీవీ సుబ్బారావు ఒక ప్రకటనలో ఆక్షేపించారు. దీనివల్ల 15 నుంచి 20 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి వెళ్ళే ప్రధానోపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నారని, ఆయా పరీక్ష పేపర్లకు కూడా భద్రత కొరవడిందన్నారు. విద్యాశాఖాధికారులే సీఆర్‌ఎంటీల ద్వారా తగిన సెక్యూరిటీతో పాఠశాలలకు పరీక్ష పేపర్లు చేర్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి వెంకట లక్ష్మమ్మను కోరారు.
పెన్షనర్లకు సన్మానం
భీమవరం: పెన్షనర్ల హక్కులు, డిమాండ్ల సాధన కోసం తన వంతు సహాయ సహకారాలందిస్తానని ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి అన్నారు. జాతీయ పెన్షనర్స్ దినోత్సవం సందర్భంగా మంగళవారం ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్ పాల్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గాతల జేమ్స్, ఎస్‌ఎస్‌ఎన్ రాజు మాట్లాడుతూ 79, 75 సంవత్సరాలకు ఇచ్చే అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ పునరుద్ధరించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలు వెంటనే మంజూరు చేయాలన్నారు. ఈ సందర్భంగా సూపర్ సీనియర్ పెన్షనర్లను సన్మానించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు విజయరామరాజు, గౌరవాధ్యక్షుడు పట్టాభిరామయ్య తదితరులు పాల్గొన్నారు.
వరి కోతలు వాయిదా వేసుకోవాలి
భీమవరం: వాయుగుండం కారణంగా జిల్లాలో రాబోయే రెండు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వరి కోతలు వాయిదా వేసుకోవాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్‌రెడ్డి సూచించారు. జిల్లాలో 2.05 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తుండగా ఇంతవరకు 1,76,000 ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయని తెలిపారు. కళ్లాల్లో ధాన్యాన్ని సురక్షితమైన ప్రాంతానికి తరలించుకోవాలని, వీలుకాని పక్షంలో సంబంధిత రైతు సేవా కేంద్రం ద్వారా కనీస మద్దతు ధరపై తేమ శాతానికి అనుగుణంగా ధాన్యాన్ని అమ్ముకోవడానికి వీలు కల్పించామన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 8121676653, 18004251291 నంబర్లకు కాల్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు.
20న విజిలెన్స్ కమిటీ సమావేశం
భీమవరం: జిల్లా విజిలెన్స్ కమిటీ సమావేశం ఈ నెల 20న ఏర్పాటు చేసినట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి ఎన్.సరోజ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లో జరుగుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment