చోరీల్లో వేగం పెంచాడు.. పోలీసులకు చిక్కాడు
భీమవరం: అతనొక కారుడ్రైవర్. చెడు వ్యసనాలకు అలవాటుపడడంతో సంపాదన సరిపోలేదు. దీంతో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. చివరికి చోరీల్లో వేగం పెంచి పోలీసులకు చిక్కాడు. పలు చోరీ కేసుల్లో నిందితుడైన భీమవరం పట్టణం మెంటేవారితోటకు చెందిన గోన వంశిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.13.80 లక్షల చోరీ సొత్తుని స్వాధీనం చేసుకున్నారు. భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి వివరాలు వెల్లడించారు.
నేర ప్రవృత్తి ఇలా..
కార్ ఆప్టింగ్ డ్రైవర్‌గా పనిచేసే గోన వంశికి 2017లో బోడపాటి ప్రవీణ్‌తో పరిచయమైంది. చెడు వ్యసనాలు అలవాటు కావడంతో ఇద్దరూ కలిసి వాహనాల దొంగతనాలు ప్రారంభించారు. ఇదే క్రమంలో ప్రవీణ్‌తో కలసి కారు, ఆటో చోరీ కేసులో పోలీసులకు దొరికిపోయారు. ఆ తరువాత ఆటో మెకానిక్‌గా పనిచేస్తూ 2023లో రాత్రి సమయంలో తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు. వంశీపై భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో 6, టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో రెండు, రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి దొంగతనం కేసులు నమోదయ్యాయి. ఈ నేరగాడిపై డీఎస్పీ ఆర్‌జీ జయసూర్య పర్యవేక్షణలో వన్‌టౌన్, టుటౌన్ సీఐలు ఎం నాగరాజు, జి కాళీచరణ్, వన్‌టౌన్ ఎస్సై బీవై కిరణ్‌కుమార్ ప్రత్యేక బృందంతో నిఘా పెట్టారు. బుధవారం ప్రకాశంచౌక్ సెంటర్‌లో వంశీని అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి రూ.13.80 లక్షల విలువ బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
పార్శిల్‌లో శవం కేసు వివరాలు
త్వరలో వెల్లడిస్తాం
ఉండిలో సంచలనం సృష్టించిన పార్శిల్‌లో శవం కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు రెండు, మూడు రోజుల్లో వెల్లడిస్తామని ఎస్పీ నయీం అస్మీ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో పండుగలు నిర్వహించుకోవాలన్నారు. భీమవరం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.
రూ.13.80 లక్షల చోరీ సొత్తు స్వాధీనం
వివరాలు వెల్లడించిన ఎస్పీ నయీం అస్మి
Comments
Please login to add a commentAdd a comment