పశువధపై పోరుబాట
సాక్షి, భీమవరం/ తణుకు అర్బన్: పశువధకు వ్యతిరేకంగా పాలకులు, అధికారులకు గోసంరక్షణ సమితి సభ్యులు, స్థానికులు పదేపదే వినతులు అందజేస్తూ వచ్చారు. సోషల్ మీడియా వేదికగా క్యాంపెయిన్ చేశారు. ఫలితం లేకపోవడంతో పోరుబాట పట్టారు. గురువారం నుంచి ఫ్యాక్టరీ ఎదుటనే నిరసన తెలిపేందుకు నిర్ణయించారు.
తణుకు మండలం తేతలిలోని సత్యవాడ రోడ్డులో ఏర్పాటుచేసిన పశువధ కేంద్రం వివాదాస్పదంగా మారింది. 2016లో ఫ్యాక్టరీ నిర్మాణ పనులు చేపట్టడం పట్ల స్థానికులు అభ్యంతరం వ్యక్తంచేశారు. పనులు పూర్తిచేసి 2022లో పశువధ మొదలు పెట్టేందుకు ప్రయత్నించే సమయంలో స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అప్పటి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి ఫ్యాక్టరీ నడపకుండా అడ్డుకున్నారు. హైకోర్టు స్టే ఇవ్వడంతో ఇక్కడ పశువధ కార్యకలాపాలు ఆగిపోయాయి.
కూటమి ప్రభుత్వం వచ్చాక..
కూటమి ప్రభుత్వం వచ్చాక ఫ్యాక్టరీ తెరిచేందుకు మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయి. సెప్టెంబరులో నిర్వాహకులు పంచాయతీని ఎన్‌ఓసీ కోరగా అందుకు అధికారులు నిరాకరించారు. ఈ వ్యవహారం ఇలా నడుస్తుండగానే పశువధ మొదలు పెట్టారని స్థానికులు అంటున్నారు. అందుకోసం కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు చెబుతున్నారు. పశువుల వ్యర్థాలు గోస్తనీ కాలువలోకి వదులుతున్నారని, వాటి నుంచి వస్తున్న దుర్గంధంతో చుట్టుపక్కల నివాసం ఉండలేని పరిస్థితి నెలకొందని, రోగాల బారిన పడుతున్నామని స్థానికులు అంటున్నారు. ఫ్యాక్టరీని వెంటనే మూసివేయాలని కోరుతూ కొద్దిరోజులుగా గ్రామస్తులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. సేవ్ తణుకు పేరిట సోషల్ మీడియాలో ఉధృతంగా క్యాంపెయిన్ చేశారు. పశువధను నిలిపివేయాలని మీకోసం కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. అయితే తమను సంప్రదించకుండానే సమస్య పరిష్కారమైనట్టుగా అధికారులు మెసేజ్‌లు పంపారని ఫిర్యాదుదారులు అంటున్నారు. రోజూ లారీల్లో భారీగా పశువులను ఫ్యాక్టరీలోకి తరలిస్తున్నారని, తణుకు పరిసర ప్రాంతాల్లో గోవుల సంఖ్య తగ్గిపోతోందని గోసంరక్షణ సమితి సభ్యులు చెబుతున్నారు. అక్రమ పశువధను అడ్డుకోవడంలో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇటీవల రామరాజ్యం సంస్థ సభ్యులు కలెక్టరేట్ వద్దకు వచ్చి నిరసన తెలిపారు. కలెక్టర్‌పైనా ఆరోపణలు చేశారు. కాగా ఇక్కడ గోవధ జరగడం లేదని, ఇతర దేశాలకు గేదెమాంసం ఎగుమతికి అనుమతులున్నట్టు పశుసంవర్ధశాఖ అధికారులు చెబుతున్నారు.
నేటినుంచి నిరవధిక నిరసన
పాలకులు, అధికారుల వైఫల్యాన్ని నిరసిస్తూ గురువారం నుంచి ఫ్యాక్టరీ ఎదుట నిరసన తెలిపేందుకు గ్రామస్తులు, గోసంరక్షణ సమితి సభ్యులు నిర్ణయించారు. ఫ్యాక్టరీ మూసేంత వరకు పోరాటం ఆపకుండా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలుగా అవసరమైన టెంట్లు, మైక్‌సెట్లు తదితర ఏర్పాట్లు చేస్తున్నారు. పురుషులు, మహిళలు, పిల్లలు అక్కడే వంట వార్పు నిర్వహిస్తూ నిరసనలో పాల్గొననున్నట్టు గ్రామస్తులు తెలిపారు.
వ్యానులో ఉన్న పశువ్యర్థాలను చూపిస్తున్న గో సేవా సమితి సభ్యులు, తేతలి గ్రామస్తులు
తేతలిలో పశువధ కర్మాగారంపై తీవ్ర వ్యతిరేకత
పలుమార్లు స్థానికులు, గో సేవా సమితి సభ్యుల ఆందోళనలు
అధికారులు పట్టించుకోకపోవడంతో నేటినుంచి పోరాటానికి నిర్ణయం
అక్కడే వంటావార్పు నిర్వహణకు ఏర్పాట్లు
పశువుల మాంసంతో వెళుతున్న లారీని పోలీసులకు అప్పగింత
తణుకు అర్బన్: తేతలి గ్రామ పరిధిలోని లేహం ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కర్మాగారం లోపల నుంచి వచ్చిన వాహనాన్ని అడ్డుకుని పోలీసులకు అప్పగించిన వ్యవహారం తణుకు రూరల్ పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తతకు దారితీసింది. కర్మాగారం ప్రాంతంలో బుధవారం ఉదయం భారీగా గ్రామస్తులు, గోసేవాసమితి సభ్యులు ఉండగా లోపల నుంచి బయటకు వచ్చిన పాల వ్యానును అడ్డుకుని పోలీసుల సాయంతో తణుకు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి ఫిర్యాదు చేశారు. అయితే ఈ వ్యవహారంపై విచారణ చేస్తామని చెప్పి పోలీసులు వ్యాన్‌ను పంపించేసేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు ఎట్టకేలకు కర్మాగారం, వాహనంపైనా కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా గోసేవా సమితి సభ్యుడు కొండ్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ కర్మాగారం లోపల నుంచి వచ్చిన వాహనంలో పశు కళేబరాలతోపాటు వ్యర్థాలు ఉన్నాయని, ఇది పశు వధ జరుగుతుందనడానికి నిదర్శనమని అన్నారు. తేతలి గ్రామ మాజీ సర్పంచ్ కోట నాగేశ్వరరావు, గ్రామ నాయకులు కోట స్వామీజీ, గోసేవా సమితి సభ్యులు జల్లూరి జగదీష్, మహిళలు పాల్గొన్నారు.
ఫ్యాక్టరీ మూసేంత వరకూ పోరాటం
నిబంధనలకు విరుద్ధంగా కొందరు అధికారుల అండతో పశువధ కర్మాగారాన్ని నిర్వహిస్తున్నారు. ఫ్యాక్టరీ తెరిచినప్పటి నుంచి ఈ ప్రాంతంలో పశువుల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. కర్మాగారం మూసేంతవరకు గో సేవా సమితి తరపున స్థానికులకు అండగా నిలబడతాం.
– కొండ్రెడ్డి శ్రీనివాస్, గో సేవా సమితి సభ్యుడు
పట్టించుకునేవారు లేరు
ఫ్యాక్టరీ నుంచి వస్తున్న దుర్గంధంతో రోగాల బారిన పడుతున్నామని గ్రామస్తులు గగ్గోలు పెడుతున్నా పట్టించుకునే వారు లేరు. తేతలి అంటే గోగులమ్మ తల్లి వెలిసిన గ్రామంగా ప్రసిద్ధి. ఇప్పుడు పశువధ కర్మగారంగా పేరు మారిపోవడం దారుణం.
– కోట నాగేశ్వరరావు, తేతలి గ్రామ మాజీ సర్పంచ్
Comments
Please login to add a commentAdd a comment