బరిలో పందెంకోఢీ
భీమవరం మండలం డేగాపురంలో బరి వద్ద ప్రత్యేక స్టాళ్లు
సాక్షి, భీమవరం : పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ పందెంరాయుళ్లు సంక్రాంతి పోటీల్లో పైచేయి సాధించారు. జిల్లా వ్యాప్తంగా సోమవారం వందకు పైగా బరుల్లో కోడిపుంజుల కాళ్లకు కత్తులు కట్టి పందేలకు తెరలేపారు. వాటిమాటున గుండాట, పేకాట, ఇతర జూద కార్యకలాపాలను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. కూటమి ప్రజాప్రతినిధులు దగ్గరుండి పందేలను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా మొదటి రోజునే రూ. 100 కోట్లకు పైగా నగదు చేతులు మారుతుందని అంచనా.
సంక్రాంతి పండుగల పేరిట కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న పోలీస్ మైకులు మూగబోయాయి. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కోడిపందేల జోరు కనిపించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో అధికంగా 130 కోడిపందేల బరులు వెలిశాయి. వీటిలో పెద్ద బరులు 40 ఉండగా మిగిలినవి చిన్నబరులు.. ఆయా నియోజకవర్గాలకు చెందిన కూటమి ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలోనే టీడీపీ, జనసేన నాయకులు వేర్వేరుగా, కూటమిగా వీటిని నిర్వహిస్తున్నారు. సాధారణంగా భోగి రోజున పోలీసుల నుంచి లైన్ క్లియర్ అయినట్టు సమాచారం వచ్చాక మధ్యాహ్నం నుంచి లేదా సాయంత్రం నుంచి పందేలను ఏర్పాటుచేసేవారు. ఈ ఏడాది ఉదయం నుంచే పందేలు, గుండాట, పేకాటలను మొదటు పెట్టేవారు. ఎక్కడికక్కడ మద్యం స్టాళ్లు ఏర్పాటచేసి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేశారు.
నియోజకవర్గాల వారీగా..
● ఉండి నియోజకవర్గం కాళ్ల మండలం పెద అమిరంలో సంప్రదాయ కోడిపందేలను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించగా అనంతరం కాళ్లకు కత్తులు కట్టి పందేలు నిర్వహించారు. బరి వద్దనే కూర్చుని ఇరువురు పందేలు తిలకించారు. సీసలిలో ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు పందేలు ప్రారంభించారు.
● భీమవరం నియోజకవర్గంలోని డేగాపురం, కొవ్వాడ అన్నవరం, వీరవాసరం, నవుడూరు గ్రామాల్లో భారీగా పందేలు, గుండాట, పేకాటలు నిర్వహిస్తున్నారు. డేగాపురం బరి వద్దకు సోమవారం పలువురు బుల్లితెర నటులు వచ్చి పందేలు చూశారు. పందేంరాయుళ్లను ఆకర్షిస్తూ వీరవాసరం మండలంలో ఎక్కువ పందేలు గెలిచిన వారికి బంగారం, బుల్లెట్, యూనికార్న్ మోటారు సైకిళ్లను బహుమతులుగా ప్రకటించారు. రోడ్లు పక్కన, ఇళ్ల మధ్యలో విచ్చలవిడిగా పేకాటలు జరుగుతున్నాయి.
● తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వేల్పూరులోని తన అనుచరులు నిర్వహిస్తున్న బరులను ప్రారంభించారు. నియోజకవర్గం వ్యాప్తంగా 22 బరులను ఏర్పాటుచేయగా తొలిరోజు రూ. 20 కోట్లకుపైగా నగదు చేతులు మారినట్టు అంచనా.
● నరసాపురంలో నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా 42 వరకు కోడిపందేల బరులు, గుండాటలు ఏర్పాటుచేశారు. రూ.10 వేల నుంచి రూ.5 లక్షలు వరకు కోడిపందాలు జరుగుతుండగా, గుండాట వద్ద మైనర్లు ఎక్కువగా కనిపించారు. తొలి రోజు రూ.10 కోట్లు చేతులు మారుతాయని అంచనా.
● ఆచంట నియోజకవర్గంలో పెనుగొండ, వడలి, దొంగరావిపాలెం, ఆచంట, వల్లూరుకోట, పోడూరు, కవిటం, పెనుమంట్ర, వెలగలేరు, మార్టేరు, పెనుమంట్ర, ఆలమూరు గ్రామాల్లో జోరుగా కోడిపందేలు, గుండాట, పేకాటలు జరుగుతున్నాయి.
● తాడేపల్లిగూడెం విమానాశ్రయం సమీపంలో భారీ సెట్టింగ్ వేశారు. ఎమ్మెల్యే బొలిశెట్టి బరిని సందర్శించారు. వివిధ జిల్లాలకు చెందిన పందెంరాయుళ్లు వచ్చారు. రూ. కోటి పెద్ద పందెం జరిగినట్టు తెలుస్తోంది. బరి వద్దనే భారీ స్థాయిలో గుండాట, పేకాటలు నిర్వహిస్తున్నారు.
● పాలకొల్లు నియోజకవర్గంలోని పూలపల్లిలో రెండు, వడ్లవానిపాలెంలో ఒకటి, యలమంచిలి మండలం కలగంపూడి, యలమంచిలి తదితర చోట్ల 25కు పైగా బరులను ఏర్పాటుచేసి భారీ ఎత్తున కోడి పందేలు, జూదాలు నిర్వహిస్తున్నారు.
మూగబోయిన పోలీసుల మైకులు
పైచేయి సాధించిన పందెంరాయుళ్లు
జిల్లా వ్యాప్తంగా బరుల వద్ద
కోడిపందేలు, గుండాట, పేకాట నిర్వహణ
మద్యం స్టాళ్లు ఏర్పాటుచేసి భారీగా అమ్మకాలు
బరులను ప్రారంభించిన కూటమి నేతలు
తొలి రోజే రూ.100 కోట్లకు పైగా చేతులు మారిన నగదు
రూ.కోట్లలో పందేలు
పెద్ద బరుల వద్ద ఒక్కో పందె రూ.ఐదు లక్షల నుంచి రూ. 15 లక్షలు వరకు జరిగితే, ఓ మాదిరి బరుల వద్ద రూ. 50 వేల నుంచి రూ.రెండు లక్షల వరకు, చిన్న బరుల వద్ద రూ. 5 వేల నుంచి రూ.లక్ష వరకు పందేలు జరుగుతున్నాయి. రూ.లక్ష నుంచి రూ.25 లక్షల వరకు పై పందేలు జరుగుతున్నాయి. తాడేపల్లిగూడెంలో రూ.కోటి పెద్ద పందెం జరిగినట్టు సమాచారం. చిన్నా పెద్దా బరులు కలిపి తొలిరోజు రూ.వంద కోట్లకు పైగా నగదు చేతులు మారినట్టు అంచనా.
Comments
Please login to add a commentAdd a comment