రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
ఏలూరు (టూటౌన్): రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఏలూరు రైల్వే ఎస్సై సైమన్ తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో, నూజివీడు రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 50–55 సం.ల వయస్సు ఉంటుంది. లేత బిస్కెట్ రంగు చొక్కా, ముక్కు పొడుం రంగు డ్రాయర్ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని ఏలూరు సర్వజన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని, వివరాలు తెలిసిన వారు సెల్ 99892 19559 నంబర్‌లో సంప్రదించాలని రైల్వే ఎస్సై సైమన్ కోరారు.
లారీ ఢీకొని మహిళ మృతి
కొయ్యలగూడెం: లారీ ఢీకొని యర్రంపేట (గొల్లగూడెం) గ్రామానికి చెందిన మహిళ మృతి చెందినట్లు ఎస్సై వి.చంద్రశేఖర్ సోమవా రం తెలిపారు. వామిశెట్టి సుబ్బలక్ష్మి (64) ఉదయం పాలు తీసుకురావడానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా అతి వేగంగా వచ్చిన లారీ వెనక నుంచి ఢీకొంది. సుబ్బలక్ష్మిపై నుంచి లారీ వెళ్లడంతో శరీరం గుర్తుపట్టలేని విధంగా ఛిద్రం అయిందని ఎస్సై తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను నిమిత్తం వచ్చిన లారీగా గుర్తించామని దీనికి సంబంధించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. మృతురాలు సుబ్బలక్ష్మి కుమారుడు సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
భారీ కొండ చిలువ హతం
పెంటపాడు: రావిపాడు గ్రామంలో సోమవారం భారీ కొండ చిలువను గ్రామస్తులు హతమార్చారు. తొలుత వెంకయ్యకాలువ సమీపంలో పశువుల పాకవద్దకు చేరిన సుమారు 10 అడుగుల కొండచిలువను చూసి స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. పశువులు, కోళ్ల వద్దకు వేగంగా తిరుగాడుతున్న కొండచిలువను స్థానికులలో కొందరు ధైర్యం చేసి హతమార్చారు. చిన్నారులు, ప్రయాణికులు సెల్ఫీలు తీసుకొంటూ వింతగా తిలకించారు. అనంతరం ఆ కొండచిలువకు కాలువ గట్టున అంత్యక్రియలు నిర్వహించారు. ప్రధానంగా రావిపాడు గ్రామంలో వెంకయ్య కాలువ పరివాహక ప్రాంతాలలో చిలకంపాడు లాకుల వరకు కొండచిలువలు ఉన్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు.
నూజివీడు చిన్న రసానికి పేటెంట్ హక్కు కల్పించాలి
నూజివీడు: దేశంలోనే పేరు ప్రఖ్యాతలు సాధించిన నూజివీడు చిన్న రసానికి పేటెంట్ హక్కు కల్పించాలని అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి హరినాథ్ సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 10.75 లక్షల ఎకరాల్లో మామిడి పంట సాగవుతోందని మామిడి ఎగుమతిలో ఉత్తరప్రదేశ్ ప్రథమ స్థానంలోనూ, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలోనూ ఉన్నాయని పేర్కొన్నారు. భూసార పరీక్ష కేంద్రాన్ని నూజివీడులో ఏర్పాటు చేయాలని, మామిడి పరిశోధన కేంద్రానికి 100 ఎకరాలు కేటాయించాలని, 70 శాతం రాయితీ మీద ట్రేడింగ్ షెడ్లు, డ్రిప్ ఇరిగేషన్ పథకాలు మంజూరు చేయాలని హరినాథ్ కోరారు. మామిడి సీజన్‌లో ఉపాధి హామీ పథకాన్ని మామిడి పంటకు అనుసంధానం చేయాలని కోరారు. నూజివీడు నుంచి ఏలూరు తరలించిన ఉద్యానశాఖ ఏడీ ఆఫీసును తిరిగి నూజివీడులో ఏర్పాటు చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment