రసవత్తరంగా బాస్కెట్‌బాల్ పోటీలు
నూజివీడు: నూజివీడు డీఏఆర్ కళాశాలలో ఈనెల 12 నుంచి నిర్వహిస్తున్న రాజా వెంకటాద్రి అప్పారావు బహద్దూర్ 48వ స్మారక పురుషుల, మహిళల జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. లీగ్ కం నాకౌట్ పద్ధతిలో నిర్వహించిన ఈ పోటీల్లో లీగ్ మ్యాచ్‌లు ముగిసి, క్వార్టర్స్‌కు చేరిన జట్లు సోమవారం హోరాహోరీగా తలపడ్డాయి. పలు జట్లలో క్రీడాకారులు తమ అత్యుత్తమ ప్రతిభను కనబర్చి తమ జట్లను విజయపథంలో నడిపించారు. మహిళల విభాగంలో సెయింట్ ఫ్రాన్సీస్ హైదరాబాద్, ఏలూరు, వీటీహెచ్ నూజివీడు, డీఎస్‌ఏ పల్నాడు జట్లు సెమీఫైనల్స్‌కు చేరాయి. సెయింట్ ఫ్రాన్సీస్ జట్టు సీబీసీ రాజమండ్రిపై 33–18 తేడాతో, ఏలూరు జట్టు స్వస్తిక్ హైదరాబాద్‌పై 32–23 తేడాతో, వీటీహెచ్ జట్టు గుడివాడపై 25–12 తేడాతో, డీఎస్‌ఏ పల్నాడు జట్టు చిత్తూరుపై 31–25 తేడాతో గెలుపొంది సెమీఫైనల్స్‌కు చేరాయి. పురుషుల క్వార్టర్స్ ఫైనల్స్ మ్యాచ్‌ల్లో ఏపీ పోలీస్, హెచ్ ఫౌండేషన్ గుంటూరు, లయోల హైదరాబాద్, స్వస్తిక్ హైదరాబాద్ జట్లు ఫైనల్స్‌కు చేరాయి. ఏపీ పోలీస్ జట్టు నెల్లూరుపై 51–37 తేడాతో, హెచ్ ఫౌండేషన్ జట్టు వీజీ బౌలర్స్ హైదరాబాద్‌పై 45–28 తేడాతో, లయోలా హైదరాబాద్ జట్టు గుంటూరుపై 50–41 తేడాతో, స్వస్తిక్ హైదరాబాద్ జట్టు జీ మామిడాడపై 63–47 స్కోర్ తేడాతో గెలుపొంది సెమీఫైనల్స్‌కు చేరాయి. ఈనెల 14న పురుషుల, మహిళల సెమీస్, ఫైనల్స్ మ్యాచ్‌లతో పాటు మూడు, నాలుగు స్థానాలకు మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఈ పోటీల నిర్వహణను ఆర్గనైజింగ్ సెక్రటరీ పసుపులేటి సాధన పర్యవేక్షించారు. బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రిఫరీలు పోటీలను నిర్వహించారు.
నేడు మహిళల, పురుషుల సెమీస్, ఫైనల్ పోటీలు
Comments
Please login to add a commentAdd a comment