దళితుల నిరసన ర్యాలీ
దెందులూరు: దళితులను ఇబ్బందులకు గురిచేస్తున్న గ్రామదీప్ నిర్వాహకురాలు మనోహరిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కొవ్వలిలో దళితులు నిరసన ర్యాలీ నిర్వహించారు. కొవ్వలి గ్రామానికి చెందిన దళిత సంఘాల నాయకులు, గ్రామస్తులు, మహిళలు 300 మంది ఫ్లకార్డులు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో దెందులూరు మండల వైస్ ఎంపీపీ గొల్ల నాగరాజు, కొవ్వలి దళిత పెద్దలు మాట్లాడుతూ దశబ్దాల నుంచి తమ పూర్వీకులు కొవ్వలిలో ఒక పంటను సాగు చేసుకుని జీవిస్తున్నారన్నారు. మారిన పరిస్థితులకనుగుణంగా కుటుంబపోషణ భారంగా ఉండటంతో గత రెండు సంవత్సరాలుగా రెండో పంటను సైతం సాగు చేసుకుంటున్నామన్నారు. పేదలందరికీ 10 సెంట్లు , 20 సెంట్లు మాత్రమే ఉందని వాటిలో కేవలం సాగు చేసుకుని జీవనాధారం పొందుతుంటే గ్రామదీప్ నిర్వాహకురాలు మనోహరి పర్యావరణం కాలుష్యం, తాగునీరు దెబ్బతింటున్నాయంటూ ఇలా ఏవేవో సాకులు చెబుతూ కోర్టులకి వెళుతూ దాదాపు 700 మంది పేద దళితుల జీవనాన్ని రోడ్డుపై పెట్టారన్నారు. ప్రభుత్వం, కోర్టులు జోక్యం చేసుకుని క్షేత్రస్ధాయిలో వాస్తవ పరిస్ధితులు తెలుసుకోవాలన్నారు. పేద దళితులను ఇబ్బందులు పెడుతున్న గ్రామ్‌దీప్ నిర్వాహకురాలు మనోహరిని అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామ పెద్దలు బూసి ఏఫ్రాయూ, కీర్తిరాజు, కాటి అర్జున్ కృష్న, ప్రత్తిపాటి సుధాకరరావు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment