వైఎస్సార్ సీపీ కార్యకర్తపై దాడి
● సంప్రదాయం ముసుగులో బాలలతో జూదాలు
జంగారెడ్డిగూడెం: కోడిపందాల్లో వైఎస్సార్ సీపీ కార్యకర్తపై గుండాట నిర్వాహకులు దాడికి పాల్పడ్డారు. బాధితుడు తెలిపిన వివరాలివి. పేరంపేట గ్రామంలో నిర్వహిస్తున్న కోడిపందాలను చూడటానికి వైఎస్సార్‌సీపీ కార్యకర్త నల్లంటి భద్రయ్య వెళ్లాడు. అక్కడే గుండాట శిబిరం వద్ద జరుగుతున్న గొడవలో కలపాల నాగరాజు అనే వ్యక్తిని కొట్టడాన్ని చూసిన భద్రయ్య ఆపేందుకు ప్రయత్నించాడు. గుండాట నిర్వాహకులు, టీడీపీకి చెందిన కోడిపందాల శిబిరం కమిటీ సభ్యులు భద్రయ్యను కొట్టి గాయపర్చారు. భద్రయ్యను అతని మేనల్లుడు, చిన్నకుమారుడు జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భద్రయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సంక్రాంతి సంప్రదాయం ముసుగులో నిర్వహిస్తున్న పలు జూదాలు బాలల భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయి. ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెంలోని కోడి పందేల బరి వద్ద పలువురు బాలలు డబ్బులు పెట్టి పులి, మేక ఆడుతూ కనిపించారు. మిగిలిన బరుల వద్ద సైతం ఇదే పరిస్థితి కనిపించింది. వీటిని అడ్డుకునే నాథుడు లేకపోవడంతో.. పెద్దలతో తామేమీ తీసిపోమన్నట్టుగా బాలలు ఈ జూదాల్లో జోరుగా పాల్గొన్నారు. సంప్రదాయం పేరుతో పందేల బరుల వద్ద గుండాట, పులి మేక, పేకాటలు నిర్వహించడం భావితరాలను జూదాల వైపునకు మరల్చడమేనని పలువురు అంటున్నారు. – ద్వారకాతిరుమల
Comments
Please login to add a commentAdd a comment