భోగి మంటల్లో విద్యుత్ బిల్లులు
భీమవరం: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై మోపిన రూ.16 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని తక్షణం తొలగించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జీల పెంపు నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం భీమవరం పట్టణంలోని నాచువారి సెంటర్లో విద్యుత్ బిల్లులు భోగి మంటల్లో వేసి దహనం చేశారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని ప్రజలపై ఎలాంటి విద్యుత్ చార్జీల భారాలు మోపమని చెప్పిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన ఆరునెలల కాలంలోనే పెద్దమొత్తంలో విద్యుత్ చార్జీల భారాలు మోపడం దారుణమన్నారు. నిరసన కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు, ఎం సీతారాం ప్రసాద్, సికిలే పుష్పకుమారి, మల్లుల శ్రీనివాస్, నాగిడి శాంతమూర్తి, వైవీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ ఆధ్వర్యంలో..
విద్యుత్ చార్జీలపై ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లులను సంక్రాంతి సందర్భంగా భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. మారుతీ నగర్, మెంటేవారితోటలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో పార్టీ జిల్లా కార్యదర్శి జెఎన్‌వీ గోపాలన్ మాట్లాడుతూ భోగి మంటల్లో పాత వస్తువులు వేయడం ఆచారంగా వస్తుందని నేడు ప్రభుత్వ నిర్వాకం కారణంగా గతంలో వాడుకున్న విద్యుత్‌కు ప్రస్తుతం బిల్లుల వసూలు చేసే ప్రయత్నానికి నిరసనగా విద్యుత్ బిల్లులను భోగి మంటల్లో వేసి దహనం చేస్తున్నామన్నారు. వినియోగదారుల ప్రయోజనాలను గాలికి వదిలేసి డిస్కంలు పెట్టే తప్పుడు ప్రతిపాదనలను నియంత్రణ మండలి, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడం దారుణమని మండిపడ్డారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జక్కంశెట్టి సత్యనారాయణ, కె.క్రాంతిబాబు, ఆకుల హరేరాం, మల్లిపూడి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment