స్మృతి వనానికి నూతన శోభ
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం జేపీ రోడ్డులోని అల్లూరి సీతారామరాజు స్మృతి వనంలో రూ.45 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫౌంటెన్, లైటింగ్ సదుపాయాలను కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం రాత్రి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో ఈ స్మృతి వనాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ భీమవరం అభివృద్ధిలో ఇలాంటి సుందరీకరణ ఎంతో ముఖ్యమని అన్నారు. రానున్న వేసవి నాటికి భీమవరం అభివృద్ధి కంటికి కనిపించేంత స్పష్టత వస్తుందని కలెక్టర్ తెలిపారు.
వశిష్ట గోదావరికి పంచ హారతులు
పోడూరు : సిద్ధాంతంలో వశిష్ట గోదావరి వద్ద సోమవారం రాత్రి పౌర్ణమి సందర్భంగా హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కటికి ప్రసాదు, తులసి చంద్రిక దంపతులచే గోదావరి మాతకు పంచ హారతులు నిర్వహించారు. వేదమూర్తులు కలగబద్రుడు, స్వామి బ్రాహ్మణత్వంతో ఏకముఖ, ద్విముఖ, చతుర్ధ, పంచమ, కుంభ, నక్షత్ర, పూర్ణకుంభ, సర్ప హారతుల కార్యక్రమం జరిగింది.
కనుల పండువగా గోదా రంగనాథుల కల్యాణం
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో శ్రీ గోదా, రంగనాథుల కల్యాణ వేడుక సోమవారం ఉదయం కనుల పండువగా జరిగింది. శ్రీ రంగనాథుని భక్తురాలైన గోదాదేవి ధనుర్మాసంలో నెల రోజులపాటు పాసురాల ద్వారా స్వామివారిని కీర్తించి, ఆ తర్వాత వివాహమాడతారు. ఆ వేడుకను స్వామివారి నిత్యార్జిత కల్యాణంతో పాటు, గోదాదేవిని ఉంచి అర్చకులు కల్యాణ తంతును వైభవోపేతంగా జరిపారు. మాంగల్యధారణ, తలంబ్రాలు వేడుకను ఘనంగా జరిపారు.
Comments
Please login to add a commentAdd a comment