తేతలిలో నిరసన శిబిరం భగ్నం
తణుకు అర్బన్: లాహం ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహస్తున్న పశు వధకు కర్మాగారానికి వ్యతిరేకంగా గత ఏడు రోజులుగా జరుగుతున్న నిరసన శిబిరాన్ని మంగళవారం పోలీసులు భగ్నం చేశారు. తేతలి వాసులు, గోసేవా సమితి ఆధ్వర్యంలో కర్మాగారం ఎదురుగా ఉన్న ఖాళీస్థలాల్లో టెంట్లు వేసి తేతలి వాసుల ఆరాధ్యదైవం గోగులమ్మ తల్లిని నిలబెట్టుకుని నిరసన శిబిరం కొనసాగించారు. దీనికి మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుతోపాటు అఖిలపక్షం, పలు సంఘాలు మద్దతు తెలిపాయి. శిబిరం మొదలైన రోజు నుంచి పోలీసులు ఆ ప్రాంతంలో బందోబస్తు ఏర్పాటుచేశారు. మంగళవారం రూరల్ పోలీసుల పిలుపు మేరకు తహసీల్దారు కార్యాలయంలో సమావేశానికి వెళ్లిన గోసేవా సమితి సభ్యుడు కొండ్రెడ్డి శ్రీనివాస్‌ను సమావేశం అనంతరం బైండోవర్ చేశారు. తేతలిలో నిరసన శిబిరం టెంట్లు తొలగించారు. ఈ సందర్భంగా గోసేవా సమితి సభ్యుడు శ్రీనివాస్ మాట్లాడుతూ మధ్యాహ్నం 12 గంటల సమయంలో రూరల్ ఎస్సై చంద్రశేఖర్ ఫోన్ చేసి రమ్మంటే తణుకు తహసీల్దారు కార్యాలయానికి వెళ్లానని,. తన వాదన విన్నాక పోలీసులు తహసీల్దారుకు బైండోవర్ చేశారని చెప్పారు. అధికారులు ప్రజలకు సేవ చేయడానికా.. లేక యాజమాన్యానికి వత్తాసు పలికడానికా అని ప్రశ్నించారు. రౌడీల్లా వ్యవహరించి టెంట్లు కూల్చడంతోపాటు గోగులమ్మ తల్లి విగ్రహాన్ని కూడా అన్యాయంగా తొలగించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment